తలొంచి బతకడం తెలియదు
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
తలొంచి బతకడం తెలియదు
- మ్యాజిక్ వేదికే నాకు మాట.. నాయకత్వం నేర్పింది
- నెత్తురొడిన వరంగల్ ఉద్యమానికి దారి చూపింది
- టిఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు గులాబీ కండువా కప్పుకున్న
- ఉద్యమంలో ముందున్నా.. అధికారానికి దూరమయ్యా
- కుట్రలతోనే రాజకీయ అవకాశాలకు దూరం
- న్యాయస్థానంలో వివక్షను ఢీకొని పేదలకు అండగా నిలిచా
- ఉద్యమ కేసుల్లో పైసా తీసుకోకుండా వాదించినా దక్కని గుర్తింపు
- వరంగల్ చారిత్రక, అస్తిత్వాన్ని, పోరాట పటిమను దెబ్బతీశారు
- ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
- ఉద్యమకారులకు రూ.10 వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
అక్షరదర్బార్, హనుమకొండ
"తలవంచి బతకడం నాకు తెలియదు. సమస్యలను ప్రశ్నిస్తూ, ఎదురిస్తూనే నా జీవితం సాగింది. తెలంగాణ ఉద్యమానికి కరదీపికగా పనిచేసిన నాలాంటి ఉద్యమకారులు, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో భాగస్వామ్యం కావడానికి ఎందుకు పనికిరాకుండా పోయారు?" అని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ ప్రశ్నించారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన తన బాల్యం, సామాజిక నేపథ్యం, న్యాయవాద వృత్తితో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
- మ్యాజిక్ వేదికే నా తొలి పాఠశాల
వరంగల్‌లో పుట్టి రంగంపేటలో పెరిగిన గుడిమళ్ళ రవికుమార్ తల్లి గుడిమళ్ళ పుష్పలీల ఎంజీఎంలో నర్సుగా, తండ్రి రాఘవేందర్‌రావు ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. కులాంతర వివాహం చేసుకున్న తల్లిదండ్రుల వద్ద పెరగడం వల్ల చిన్నతనం నుంచే సామాజిక అసమానతలపై అవగాహన పెరిగింది. ప్రముఖ మెజీషియన్ ఉమాపతి వద్ద మ్యాజిక్ నేర్చుకుని వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఈ వేదికలే ఆయనలోని బిడియాన్ని పోగొట్టి, పదిమందిలో ధైర్యంగా మాట్లాడే శక్తిని, నాయకత్వ లక్షణాలను ఇచ్చాయి. 1982లో 'మూన్‌లైట్ యూత్' ద్వారా వ్యాయామశాల, 'నవచైతన్య అసోసియేషన్' ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణం, వరద బాధితులకు సాయం, మహిళా విద్యార్థినులకు రక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. మండల్ కమిషన్ పోరాటాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.
- నెత్తురోడిన వరంగల్‌కు శాంతియుత ఉద్యమ బాట
1980–2000 మధ్య కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న ఎన్‌కౌంటర్లు, మందుపాతరలు, అమాయకుల మరణాలు తనను తీవ్రంగా కలచివేశాయని రవికుమార్ తెలిపారు. తెలంగాణ వెనుకబాటుతనమే ఈ హింసకు మూలమని గ్రహించి, ప్రత్యేక రాష్ట్ర సాధనే శాశ్వత పరిష్కారమని నమ్మారు. ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాంధేయవాది భూపతి కృష్ణమూర్తి, ఆచార్య బి. జనార్ధన్‌రావు, ఆచార్య కూరపాటి వెంకటనారాయణ వంటి మహానీయులతో కలిసి వేదికలు పంచుకుంటూ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేశారు.
- కోర్టులోనూ పోరాటమే.. రూపాయి తీసుకోకుండా ఉద్యమ కేసులు
1995లో న్యాయవాద వృత్తిలోకి వచ్చిన రవికుమార్ కోర్టుల్లో ఉన్న వర్గ, కుల వివక్షను ఢీకొని నిలదొక్కుకున్నారు. 'మ్యాజిషియన్ రవికుమార్' నుంచి 'అడ్వకేట్ గుడిమళ్ళ రవికుమార్'గా గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు, ఉద్యమకారులకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా కేసులను వాదించారు. 1998లో 'యువ న్యాయవాదుల సంఘం' ఏర్పాటు చేసి యువ లాయర్ల నైపుణ్యాభివృద్ధికి కృషి చేశారు.
- జలదృశ్యంలో గులాబీ అడుగు.. పల్లెపల్లెనా జెండా పండుగ
కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకతపై 1998–99లోనే ప్రొఫెసర్ జయశంకర్‌తో చర్చించిన రవికుమార్, 2001లో పార్టీ ఆవిర్భావ రోజే హైదరాబాద్‌లోని జలదృశ్యంలో ఏడుగురు న్యాయవాదులతో కలిసి తొలిసారిగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు పలువురు ముఖ్య నేతలపై నమోదైన కేసులను రూపాయి ఆశించకుండా వాదించారు. యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రాత్రింబవళ్లు పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో జెండాలు, గద్దెలు ఏర్పాటు చేశారు. ఆటోడ్రైవర్లను, పూల వర్తకులను యూనియన్లుగా సంఘటితం చేసి ఉద్యమంలోకి తీసుకెళ్లారు.
- కుట్రలతోనే దూరమైన ఎంపీ టికెట్
చట్ట పరిజ్ఞానం, వాగ్ధాటి, భాషా నైపుణ్యం కలిగిన రవికుమార్‌కు వరంగల్ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైనప్పటికీ చివరకు దక్కకుండా పోయింది. తాను గెలిచి వస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని భావించిన కొందరు స్వార్థ నేతలు, పార్టీ అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు ఇచ్చి టికెట్ దక్కకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఉద్యమంలో ప్రాణాలు, జీవితాలు పణంగా పెట్టిన వారికి స్వరాష్ట్రంలో తగిన ప్రాధాన్యం దక్కలేదని, తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఓరుగల్లు అస్తిత్వానికి విఘాతం
వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని రవికుమార్ విమర్శించారు. జిల్లాల విభజన వల్ల ఓరుగల్లు చారిత్రక అస్తిత్వం దెబ్బతిన్నదని, ప్రజాప్రతినిధులు అధిష్ఠానాల వద్ద విధేయత చూపడానికే ప్రాధాన్యమిస్తూ ప్రజల తరఫున ప్రశ్నించడం మరచిపోయారని మండిపడ్డారు.
- ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యం
ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితిని తెలుసుకునేందుకు సెప్టెంబర్ 17న వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద ప్రారంభించిన 4 రోజుల 'ఓదార్పు యాత్ర' ద్వారా 126 బాధిత కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన వారి ఇళ్లలో నేటికీ సంతోషం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లు
ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం కేటాయించాలి. ఉద్యమకారుల కోసం రూ.10,000 కోట్లతో సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బాధిత ఉద్యమకారుల కుటుంబాల్లోని సభ్యులకు సముచిత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. "ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవులు పొందే రాజకీయాలకు నేను చాలా దూరం. ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు, వారి హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మా పోరాటం ఆగదు" అని గుడిమళ్ళ రవికుమార్ స్పష్టం చేశారు.