రామప్పను రక్షించుకుందాం
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
రామప్పను రక్షించుకుందాం
- సింగరేణి ఓపెన్ కాస్ట్ తో చారిత్రక రామప్పకు ముప్పు
- కేవలం ఐదు కిమీ దూరంలో 300 మీటర్ల లోతున తవ్వకాలు
- భూగర్భ చీలికలతో రామప్ప సరస్సు నీరు లీకయ్యే ప్రమాదం
- సరస్సు కట్ట తెగితే దిగువ ప్రాంతాలకు పెను ముప్పు
- పునాదిలో ఇసుక కొట్టుకుపోతే ఆలయ స్థిరత్వానికి దెబ్బ
- యునెస్కో గుర్తింపుపై కూడా ప్రభావం పడే అవకాశం
- వినాశకర ఓసీ ప్రతిపాదనపై స్పష్టమైన శాస్త్రీయ అధ్యయనం చేయాలి
- ఓపెన్ కాస్ట్ తవ్వకాల ప్రతిపాదనను నిలిపివేయాలి
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
అక్షరదర్బార్, హనుమకొండ:
కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప ఆలయం, వేలాది ఎకరాలకు సాగునీరందించే చారిత్రక రామప్ప సరస్సు మనుగడకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి సంస్థ ప్రతిపాదించిన వెంకటాపురం ఓపెన్ కాస్ట్ బొగ్గు గని తవ్వకాల వల్ల ఈ చారిత్రక కట్టడాలకు, పరిసర పర్యావరణానికి భారీ విఘాతం కలిగే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు, వరంగల్ నిట్ విశ్రాంత ప్రొఫెసర్ ఎం పాండు రంగారావు తీవ్ర హెచ్చరిక చేశారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన ఓపెన్ కాస్ట్ (ఓసీ) తవ్వకాలతో రామప్ప ప్రాంతానికి రానున్న ముప్పులను విశ్లేషించారు.
- భూగర్భ చీలికలతోనే అసలు ముప్పు!
కేవలం ఆలయానికి, గనికి మధ్య ఉన్న ఐదు కిలోమీటర్ల భౌతిక దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని ప్రొఫెసర్ పాండు రంగారావు తెలిపారు. వెంకటాపురం వద్ద ప్రతిపాదించిన గని ప్రాంతానికి, రామప్ప సరస్సుకు మధ్య స్పష్టమైన భౌగోళిక సంబంధం ఉందని కేహెచ్‌టీ రూపొందించిన పటాలు స్పష్టం చేస్తున్నాయి. భూమి పొరల్లో ఉన్న ప్రధాన, ఉప భ్రంశాలు, పగుళ్లు గని తవ్వకాల బ్లాస్టింగ్‌ల వల్ల క్రియాశీలమైతే భూగర్భ జలాల ప్రవాహంలో ప్రమాదకర మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన వివరించారు.
- 300 మీటర్ల లోతుల్లో తవ్వకాలు.. సరస్సు కట్టకు లీకేజీ ప్రమాదం!
ఈ ప్రాంతం ప్రాణహిత-గోదావరి గ్రాబెన్ బేసిన్‌లో భాగంగా ఉండి, ఇసుకరాయి, షేల్, కంకర పొరలతో కూడి ఉంటుంది. సుమారు 300 మీటర్ల లోతు వరకు ఓసీ తవ్వకాలు జరిపితే భూగర్భ జలాల పీడనంలో తీవ్ర వ్యత్యాసాలు వస్తాయి. పీడనం తగ్గడం వల్ల 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రామప్ప సరస్సు నీరు భూగర్భ చీలికల ద్వారా ఓసీ వైపు లీకయ్యే ప్రమాదం ఉంది. కొండలను కలుపుతూ నిర్మించిన ఈ మట్టి కట్టకు నీటి చొరబాటును నిరోధించే 'కట్ ఆఫ్ ట్రెంచ్' లేకపోవడం వల్ల, ప్రవాహ మార్గాలు మారితే కట్ట స్థిరత్వం దెబ్బతిని దిగువ ప్రాంతాల ప్రజలు, పంటలు, ఆస్తులకు ముప్పు వాటిల్లుతుంది.
- ‘పైపింగ్ ఫినామినా’తో ఆలయ పునాదులు గుల్ల!
కాకతీయుల ఇంజినీరింగ్ అద్భుతమైన ఇసుక పెట్టె (సాండ్ బాక్స్) పునాది పద్ధతికి భూగర్భ జలాల మార్పులు ప్రమాదకరంగా మారవచ్చు. జల ప్రవాహాల్లో మార్పుల వల్ల పునాదిలోని ఇసుక, మట్టి రేణువులు కొట్టుకుపోయి అంతర్గత ఖాళీలు ఏర్పడే (‘పైపింగ్ ఫినామినా’) ప్రమాదం ఉందని జీఎస్‌ఐ నివేదికల ఆధారంగా ఆయన స్పష్టం చేశారు. ఆలయంలో ఇప్పటికే రంగమండపం దూలాలకు ఉన్న పగుళ్లు, అసమాన కూర్చువేతల నేపథ్యంలో పేలుళ్ల వల్ల వచ్చే ధ్వని, ప్రకంపనలు పునాది స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
- జీఎస్‌ఐ నివేదికను సమగ్రంగా పరిశీలించాలి
2023 జూన్ 30 నాటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదికలోని 21, 22 పేజీల్లో ఉన్న కీలక వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రొఫెసర్ విజ్ఞప్తి చేశారు. సరస్సు నీటిమట్టం, భూగర్భ జలాల కదలికలు, హైడ్రాలిక్ గ్రేడియంట్‌లో వచ్చే మార్పులు గని ప్రాంతం వరకు విస్తరిస్తాయి. ఈ ఆధారాలను విస్మరించి గని తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం శతాబ్దాల చరిత్రను ముప్పులోకి నెట్టడమే అవుతుంది.
- పేలుళ్ల ప్రకంపనలు.. దీర్ఘకాలిక వినాశనం
ఓపెన్ కాస్ట్ గనిలో పదేపదే నిర్వహించే పేలుళ్ల వల్ల దీర్ఘకాలంలో ఆలయ రాతి నిర్మాణాలు, దూలాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. స్వల్ప ప్రకంపనలే కదా అని తేలిగ్గా తీసిపారేయకుండా నిపుణుల కమిటీతో ఆలయ ప్రస్తుత స్థితిని పూర్తిస్థాయిలో నమోదు చేసి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
- 80 వేల ఎకరాల సాగు నీటికి గండి.. 20 గ్రామాలపై ప్రభావం
రామప్ప సరస్సు కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, ఈ ప్రాంత రైతాంగానికి జీవనాధారం. ఈ సరస్సు ద్వారా దాదాపు 30 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 80 వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందుతోంది. సరస్సు నీటి మట్టం తగ్గినా లేదా కట్ట దెబ్బతిన్నా దాదాపు 20 గ్రామాల ప్రజల జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపునకు ప్రమాదం
2021 జులై 25న లభించిన యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కాకతీయుల ప్రతిభను ప్రపంచ పటంలో నిలిపింది. కేవలం ఆలయాన్ని మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న పర్యావరణం, సరస్సు భద్రతను కాపాడడం ప్రభుత్వం బాధ్యత. గని తవ్వకాల వల్ల ఆలయ నిర్మాణ భద్రతకు ముప్పు ఏర్పడితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు.. గని పునరాలోచనకు డిమాండ్
సింగరేణి వెంకటాపురం గని ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి (2025 జనవరి 27న), సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతికి (2026 అక్టోబరు 3న) లేఖలు రాసినట్లు ప్రొఫెసర్ వెల్లడించారు. ఎన్‌వోసీ, పర్యావరణ అనుమతులు, జీఎస్‌ఐ నివేదికలపై స్పష్టత వచ్చే వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, స్వతంత్ర నిపుణుల అధ్యయనం పూర్తయ్యే వరకు ఓసీ గని ప్రతిపాదనను నిలిపివేయాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.