హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్ చేశారు
- పట్టుబట్టి నన్ను బర్తరఫ్ చేయించారు
- సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఆరోపణలు
- తన కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారని నిలదీత
- రాజీనామా చేయమని నన్నెవరూ అడగలేదని వివరణ
- అధిష్ఠానానికి ఇచ్చిన లేఖను మీడియాకు ఇచ్చిన కొండా సురేఖ
హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్ చేశారు
- పట్టుబట్టి నన్ను బర్తరఫ్ చేయించారు
- సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఆరోపణలు
- తన కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారని నిలదీత
- రాజీనామా చేయమని నన్నెవరూ అడగలేదని వివరణ
- అధిష్ఠానానికి ఇచ్చిన లేఖను మీడియాకు ఇచ్చిన కొండా సురేఖ
అక్షరదర్బార్, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయాలన్న నిర్ణయంపై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. గురువారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆమె తనని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడాన్ని ఖండించారు. నిర్ణయానికి ముందు తన వివరణ తీసుకోవాల్సిందని అన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. తన కుమార్తె స్వతంత్ర మహిళ అని, ఆమె వ్యాఖ్యలు ఆమెవేనని పేర్కొన్నారు. మీడియాకు ఇచ్చిన నోట్‌లో ఊరు, పేరు లేదు.
- రేవంత్ రెడ్డి పట్టుబట్టి
ఉరిశిక్ష పడిన ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతారన్న కొండా సురేఖ తనను మాత్రం ఏ వివరణ అడగకుండానే తొలగించారని, తనను ఇలా ఏకపక్షంగా తొలగించటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తొలగించడం అధిష్ఠానానికి కూడా ఇష్టం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి తనని బర్తరఫ్ చేయిస్తున్నారని, 'బర్తరఫ్ చేస్తారా? నన్ను వెళ్లిపోమ్మంటారా' అని అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్ చేశారని ఆమె ఆరోపించారు.
- కక్షగట్టి వేధించారు
తన మీద, తన మాజీ ఓఎస్‌డీ మీద కుట్రలు చేస్తున్నారని, దీని వెనక వేం నరేందర్‌రెడ్డి, పొంగులేటి, కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మరికొందరు ఉన్నారన్నారు. అందరూ కలిసి కావాలని కక్షగట్టి నన్ను, సుమంత్ కుటుంబాన్ని వేధించారని విమర్శించారు. సుమంత్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
- సీఎంపై నేను విమర్శలు చేయలేదు
"సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీపై నేను ఎలాంటి విమర్శలు చేయలేదు. ఒకప్పుడు మల్లు రవి కూడా కాంగ్రెస్‌ను తిట్టారు. మాజీ సీఎం రోశయ్య, జైపాల్‌రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారు. నా కుమార్తె వ్యాఖ్యలకు నాపై చర్యలు తీసుకోవటం బాధాకరం. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని తిట్టినవారికి పదువులు ఇచ్చారు. నన్ను తొలగించినందుకు ఏమీ బాధపడటం లేదు. కారణం చెప్పకుండా తొలగించడమే చాలా బాధాకరం. బీసీ మహిళను ఇలా అవమానకరంగా తొలగించటం బాధాకరం. కారణం చెప్పకుండా తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కారణం చెప్పాల్సిన బాధ్యత సీఎం, ఏఐసీసీపై ఉంది" అని కొండా సురేఖ అన్నారు.
- వివక్ష చూపారు
మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన ప్రమేయం లేకుండానే తన శాఖలో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండా తన ఓఎస్‌డీ సుమంత్‌ను తప్పించారని, అభివృద్ధి విషయంలో తన నియోజకవర్గంపై వివక్ష చూపారని విమర్శించారు. తన శాఖలోని అంశాలపై కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారని, తన శాఖలోని అధికారులతో కడియం సమీక్షలు నిర్వహించారని తెలిపారు.
- ప్రజల్లో వ్యతిరేకత ఉంది
మంత్రులందరూ సంతోషంగా ఉన్నారా? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలని సురేఖ కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ సంతోషంగా లేరనే విషయం అందరికీ తెలుసనని తెలిపారు. ఇప్పటికైనా అందరూ బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని సూచించారు. ప్రజలకు సేవ, అభివృద్ధి చేయలేకపోతున్నామనే బాధ అందరిలో ఉందని, పనుల జరగాలంటే ఎవరివద్దకు వెళ్లాలో తెలియని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. ఇస్తామన్న హామీలు నెరవేర్చకపోవటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు.
- ఎమ్మెల్యేగా కొనసాగుతా?
క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేయించుకుంటే మంచిదని సూచించారు. తాను పునరాలోచించుకోమని చెప్పనని, పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే చాలా మార్పులు చేసుకోవాలని, రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని హితువు పలికారు. తనవైపు ఒక వేలు చూపితే రేవంత్‌రెడ్డి వైపు నాలుగువేళ్లు చూపుతాయని ఎద్దేవా చేశారు. ప్లాన్-బిపై ఇంకా ఏమీ ఆలోచించుకోలేదనిఎమ్మెల్యేగా కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
- ఇంకా ఆలోచించుకోలేదు
తన కుమార్తె వ్యాఖ్యలను తాను ఖండించాల్సిన అవసరం లేదన్న సురేఖ తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుపట్టే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. అధిష్ఠానానికి తాను ఇచ్చిన లేఖను మీడియాకు ఇస్తున్నానని, భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించుకోలేదని తెలిపారు. జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారని ఆమె నిలదీశారు.
- రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి
తాను తప్పు చేయలేదని, తనకు పశ్చాత్తాపం లేదని కొండా సురేఖ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వైఎస్‌ఆర్ తర్వాత రేవంత్ రెడ్డినే ఎక్కువ అభిమానించానని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, సీఎం కావాలని తానే ముందు కోరుకున్నానని పేర్కొన్నారు.
- సంతోషంగా ఉంది
తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నానన్న కొండా సురేఖ తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావటం సంతోషకరమని తెలిపారు. తన కోసం చిన్నారెడ్డిపై వేటు వేయటం సరికాదని అభిప్రాయపడ్డారు.
"నన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడాన్ని ఖండిస్తున్నా. రాజీనామా చేయమని నన్నెవరూ అడగలేదు. నా వివరణ వినకుండా నేరుగా తొలగించటం సరికాదు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సింది. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?. నేను తప్పు చేయలేదు. నాకు పశ్చాత్తాపం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వైఎస్‌ఆర్ తర్వాత రేవంత్‌రెడ్డినే ఎక్కువ అభిమానించాను. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, సీఎం కావాలని నేనే ముందు కోరుకున్నా. నాపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నా. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించుకోలేదు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావటం సంతోషకరం. నా కోసం చిన్నారెడ్డిపై వేటు వేయటం సరికాదు" అని సురేఖ అన్నారు.