పోరాటమే నా పునాది

పోరాటమే నా పునాది

- 2023 ఎన్నికల్లో గెలిచి లక్ష్యాన్ని ముద్దాడ 
- నాకు ఏ పదవి వచ్చినా బోనస్సే 
- వరంగల్ బ్రాండ్ పెంచటమే లక్ష్యం 
- నా రాజకీయ వారసురాలుగా బిడ్డ 
- పార్టీ ఆదేశిస్తే కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉంటది
- జీడబ్ల్యూఎంసీ పరిధిలో డివిజన్లు 80 కి పెరిగే అవకాశం 
- మేయర్ సహా డివిజన్లలో రిజర్వేషన్లు మారే ఛాన్స్ 
- డిజిటల్ మీడియా ప్రతినిధులతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చిట్ చాట్ 

పోరాటమే నా పునాది 

- చదువు అబ్బకపోయేది.. ఒక్కో సెక్షన్ లో రెండేసి సార్లు చదివిన
- సీకేఎం కాలేజీలో ఏబీవీపీతో జరిగిన గొడవలో కత్తిపోట్లు
- అప్పట్లో పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న కిన్నెరా హోటల్ మా అడ్డా 
- ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ పేర్లతో కిషన్ పురలో కార్యాలయం ఉండేది 
- ఆర్ట్స్ కాలేజీలో చేరిన రెండు నెలలకే నన్ను నాపై దాడి చేశారు 
- డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ ను అయిన
-  ఐదుగురం పోటీ పడితే యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి నాకు దక్కింది 
- విజయవాడ సమరభేరి సభకు కార్యకర్తలతో తరలి వెళ్లా
- మొదట కాంగ్రెస్ పార్టీ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన 
- 2014లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 11 ఏళ్లు కొనసాగా
- ఎన్నికల్లో పోటీ చేయాలి.. అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక ఉండేది
- తొలిసారి 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించగా పొత్తులో మందాడికి దక్కింది 
- 2009లో పార్టీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారింది
- రాజకీయాల్లో నా గురువు హయగ్రీవ చారి.. మా హెడ్ తోకల దేవేందర్ రెడ్డి
- నాపై మొత్తం 54 కేసులు ఉన్నాయి
- కొందరు డ్రగ్స్ కు అడక్ట్ అయితున్నట్లు నేను కాంగ్రెస్ పార్టీకి అడక్ట్ అయ్యా
- పార్టీ మారాలని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఒప్పుకోలే.. వేరే కండువా మెడలో ఊహించుకోలే
- 2023 ఎన్నికల్లో గెలిచి లక్ష్యాన్ని ముద్దాడ 
- నాకు ఏ పదవి వచ్చినా బోనస్సే 
- వరంగల్ బ్రాండ్ పెంచటమే లక్ష్యం 
- నా రాజకీయ వారసురాలుగా బిడ్డ 
- పార్టీ ఆదేశిస్తే కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉంటది
- జీడబ్ల్యూఎంసీ పరిధిలో డివిజన్లు 80 కి పెరిగే అవకాశం 
- మేయర్ సహా డివిజన్లలో రిజర్వేషన్లు మారే ఛాన్స్ 
- డిజిటల్ మీడియా ప్రతినిధులతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చిట్ చాట్ 


అక్షరదర్బార్, హనుమకొండ 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాటల్లో..
మా అమ్మన్నాన్న జయమాల-నరేందర్‌రెడ్డి. తొర్రూరు ప్రాంతంలోని దాట్లలో ఉండేవారు. అక్కడ మా కుటుంబానికి ఇప్పటికీ భూములు ఉన్నాయి. మా తండ్రికి పెళ్లైన తరువాత కొద్ది రోజులకే హన్మకొండకు వచ్చారు. నేను మిషన్‌ హాస్పిటల్ లో పుట్టాను. ఇద్దరం అన్నదమ్ములం. నేను పెద్దోడిని, తమ్ముడు అమరేందర్ రెడ్డి. అతడు ఇప్పుడు వరంగల్ క్రెడాయి అధ్యక్షుడు. ‘మాది రాజకీయ కుటుంబం కాదు. ఇంతకుముందు మా కుటుంబంలో ఎవరూ పాలిటిక్స్‌లో లేరు. 

- స్కూల్‌లోనే పోరాటానికి బీజం.. 
సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌లో నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆ తర్వాత గౌతమ్‌ ప్రాక్టిసింగ్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో చదివించేందుకు మా తండ్రి చేర్పించారు. ఏడు లేదంటే ఎనిమిదో తరగతిలో ఉన్న సమయంలో జరిగిన ఓ సంఘటన నాకు స్కూల్లో మంచి గుర్తింపు తెచ్చింది. ఆగస్టు 15న పాఠశాలలో జెండా వందనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి త్రివర్ణ పతాకం వద్దని, బ్లాక్‌ జెండా పెడతామన్నారు. దీనికి ప్రిన్సిపాల్‌ అంగీకరించకపోవడంతో చిన్నపాటి పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్‌ కిందపడగా నేను వెంటనే స్పందించి వారితో ఫైటింగ్‌కు వెళ్లాను. ఆ ఘటన తర్వాత స్కూల్లో తన క్రేజ్‌ పెరిగిపోయింది. నాకు మంచి ఇమేజ్‌ వచ్చింది. ‘సార్లు నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే నాకు భలే అనిపించేది'. అయితే చదువుపై మాత్రం చిన్నప్పటి నుంచే ఆసక్తి లేదు. స్కూల్‌ బంద్‌ కొట్టి సినిమాలకు వెళ్లేవాడిని. మాకు సత్యనారాయణ అనే మంచి టీచర్‌ ఉండేవారు. మేము థియేటర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడికే వచ్చి క్లాస్‌రూమ్‌కు తీసుకొచ్చేవారు.

- చదువు అబ్బలేదు.. 
నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. బలవంతంగా చదివినప్పటికీ కష్టంగా పాస్‌ అయ్యేవాడిని. ఒకసారి పరీక్షలో సున్నా మార్కులు రావడంతో మా తండ్రి తల్లి ముందు తిడుతూ.. ‘వీడు చదవడు.. బర్లు కాయడానికి పంపిస్తా’ అని అన్నారు. తండ్రి నిజంగానే బర్లు కాయడానికి పంపిస్తారని భావించి నేను అందుకు సిద్ధమయ్యా. అది చూసిన తండ్రి మళ్లీ నన్ను తిట్టారు. డిగ్రీలో లెక్చరర్లు ఎంత కష్టపడ్డా నేను పాస్‌ కాలేదు. నేను.. వాళ్లు ఎంత ప్రయత్నించినా పాస్‌ కాకపోయాను. నాకు పుస్తకం అంటేనే పడకపోయేది’.  

- ఇంటర్‌లోనే రాజకీయ రగడ.. 
హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్ చదవిన. మా స్నేహితులు సీకేఎం కాలేజీలో ఎన్‌ఎస్‌యూఐ తరఫున బ్యానర్లు కట్టేందుకు వెళ్లగా వారిపై ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ దాడి చేశారు. వారిని బురదలో పడేసి తొక్కారు. దీంతో మరుసటి రోజు నేను 18 మందితో సీకేఎం కాలేజీకి వెళ్లా. అక్కడ ఏబీవీపీకి చెందిన వారు చాలా మంది ఉన్నారు. వెనక్కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఘర్షణకు దారి తీసి కత్తిపోట్లు జరిగాయి. ఆ ఘటన అప్పట్లో పత్రికల్లో సంచలనం సృష్టించింది. మాపై కేసులు నమోదయ్యాయి. నా లైఫ్ లో అది ఫస్ట్ కేసు. అప్పట్లో బస్వరాజు సారయ్య పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడి కొట్టకుండా చేశారు.

- కిన్నెర హోటల్‌ మా అడ్డా.. 
పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలోని కిన్నెర హోటల్‌ వద్ద ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డా ఉండేది. కోహినూర్‌ హోటల్‌ మరో సంఘం అడ్డా ఉండేది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అప్పట్లో హన్మకొండ కిషన్ పురలో లో ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ బోర్డుతో కార్యాలయం ఉండేది. మేము కార్యాలయంలో బియ్యం బస్తాలు తెచ్చి పెట్టుకునేవాళ్లం. అప్పట్లో రామకృష్ణ పరమహంస అనే డీఎస్పీ రాత్రి సమయంలో కార్యాలయం వద్దకు నలుగురు పోలీసులను సెక్యూరిటీగా పంపేవారు. ‘అప్పుడు యుద్ధ వాతావరణం లెక్క ఉండేది’. 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ పదవికి కాంగ్రెస్‌ నుంచి ఎర్ర ప్రకాశ్‌రెడ్డి, మరో పార్టీ నుంచి రావు అమరేందర్‌రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలోనూ ఫైటింగ్‌ జరిగింది. అదే సమయంలో నాపై తొలిసారి రాజకీయ కేసు నమోదైంది. ఆ కేసును కూడా బస్వరాజు సారయ్యే డీల్‌ చేశారు.

- డిగ్రీలోనే ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా.. 
1988లో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీలో చేరాను. అందులో సీటు రావడం కూడా పెద్ద మిస్టరీ. కాలేజీలో చేరిన రెండు మూడు నెలలకే నాపై దాడి జరిగింది. అప్పట్లో వడ్డెపల్లి ప్రాంతానికి చెందిన వారంటే భయం ఉండేది. నేను మాత్రం మామూలుగానే ఒక టీం మెయింటెయిన్‌ చేసేవాడిని. అది కొందరికి నచ్చలేదు. నాపై దాడి చేస్తే రివెంజ్‌ తీర్చుకుంటానన్న విషయం వారికి కూడా తెలుసు. రెండు మూడు రోజులు ఓపిక పట్టిన తర్వాత గ్రౌండ్‌లో దొరికిన వారిని దొరికినట్టుగా హాకీ స్టిక్స్‌తో కొట్టాను. ఆ ఘటన తర్వాత డిగ్రీ ఫస్టియర్‌లోనే నాకు ఎన్‌ఎస్‌యూఐ కాలేజీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై నిలదీసేవాడిని. దీంతో కాలేజీ నుంచి నన్ను బయటకు పంపేందుకు శతవిధాలా ప్రయత్నాలు జరిగాయి.

- యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజకీయ మలుపు.. 
నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవే. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పీవీ రంగారావు నన్ను ప్రోత్సహించారు. దేవేందర్‌రెడ్డితో పోటీ ఉన్నప్పటికీ ఆయన వర్గాన్ని కాదని నాకు అవకాశం ఇచ్చారు. విజయవాడలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమరభేరి సభ ఏర్పాటు చేసినప్పుడు నేను 102 వాహనాలను ఏర్పాటు చేశాను. అందులో 100 సుమోలు, రెండు బస్సులు ఉన్నాయి. వాటికి నా ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టించాం. ఇక నా స్నేహితుడు గోల్డ్‌స్మిత్‌ విజయవాడలో ఉండేవాడు. అతనికి ఫోన్‌ చేసి భోజనాలు, వాటర్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, నాలుగు బ్యానర్లు కూడా చేయించి కట్టాలని చెప్పాను. అయితే నేను చెప్పినదానికంటే రెట్టింపు ఏర్పాట్లు చేశాడు. జంబో పూలదండ, కటౌట్లు కూడా ఏర్పాటు చేశాడు. నా వెంట రమేశ్‌బాబు, వినోద్‌కుమార్‌, అజీజ్‌ఖాన్‌ వచ్చారు. అయితే నా దోస్తు ఎంత బిల్లు పంపిస్తాడో అని భయపడ్డ. కానీ ఏమీ పంపలేదు.

- ‘పని చేసే అధ్యక్షుడు’.. 
ఆ తర్వాత నన్ను సిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, పుల్లా భాస్కర్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జి రఘువీరా రెడ్డి నన్ను ‘పని చేసే అధ్యక్షుడు’ అని సరదాగా పిలిచేవారు. నాకు హయగ్రీవాచారి రాజకీయ గురువు. మాకు తోకల దేవేందర్‌రెడ్డి హెడ్. వారి శిష్యుడిని. సిటీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పనిచేశాను. 2005లో లైబ్రరీ చైర్మన్‌గా పని చేశాను. 2014లో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను డీసీసీగా పనిచేశాను. కాకతీయ ఆటో యూనియన్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ తదితర సుమారు 20 సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను.

- 2004 నుంచే టికెట్‌ వేట.. 
అసెంబ్లీ టికెట్‌ కోసం 2004లోనే అడిగాను. అప్పట్లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పొత్తులో హనుమకొండ సీటు టీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో మందాడి సత్యనారాయణరెడ్డి బరిలో దిగారు. 2009లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వరంగల్ పశ్చిమ నుంచి దయాసాగర్‌కు టికెట్‌ కేటాయించారు. 2014లో పార్టీ ఎర్రబెల్లి స్వర్ణకు అవకాశం ఇచ్చింది. 2018లో మహాకూటమి అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు.

- 2009లో టికెట్‌ కన్ఫాం.. చివర్లో కోత..  
2009లో రాహుల్‌గాంధీ యూత్‌ కాంగ్రెస్‌ కోటాలో తనకు టికెట్‌ ఖరారైంది. బక్క జడ్సన్‌ నా ఫోన్‌ నుంచి దరఖాస్తు చేయగా జితేందర్‌సింగ్‌ నుంచి ‘మీకు టికెట్‌ కన్ఫాం’ అంటూ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ అర్థం కాక ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఢిల్లీలోని నంబర్‌ అని తెలిసింది. వెంటనే ఢిల్లీ వెళ్లి టికెట్‌ విషయాన్ని కన్ఫాం చేసుకున్న. యూత్‌ కోటాలో తనతో పాటు ఏడుగురికి టికెట్లు కేటాయించినప్పటికీ ఢిల్లీలో జరిగిన మంతనాల తర్వాత తన టికెట్‌ తీసేశారు. ‘ఇదేంటని అడిగితే వైఎస్‌ నా భుజంపై చేయి వేసి చెప్పకనే చెప్పారు'.

- 2023లో టికెట్‌ కోసం మళ్లీ పోరాటం.. 
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలను ఛేదించి టికెట్‌ తెచ్చుకున్న. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత పీసీసీ అధ్యక్షుడయ్యారని, ఆయనను కలిసి టికెట్‌ ఇస్తే కష్టపడి పనిచేస్తానని చెప్పాను. ‘2004 నుంచి టికెట్‌ చేజారిపోతోంది. నేను కష్టపడి పనిచేసే సమయానికి వేరే వాళ్లు రావడం పరిపాటిగా మారింది. నాకు టికెట్‌ కన్ఫాం చేస్తే నా పనిలో నేను ఉంటానని చెప్పా’. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత చెబుతానని రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వే రిపోర్టు రాగానే ముందుకు వెళ్లాలని ఎన్నికలకు ఏడాది ముందే సూచించారు. ఫస్ట్‌ లిస్ట్‌లో తన పేరు రావాల్సి ఉన్నప్పటికీ కొందరు అడ్డుకున్నారు. అధిష్ఠానం వద్ద తనపై ఏవేవో చెప్పారని, దీంతో రీ-సర్వేలు, స్పాట్‌ సర్వేలు నిర్వహించిన తర్వాత చివరకు తనకు టికెట్‌ ఇచ్చారు.

- సొంత పార్టీలోనూ తొక్కే ప్రయత్నం.. 
రాజకీయ జీవితంలో ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత పార్టీలోనూ తనను తొక్కే ప్రయత్నాలు జరిగాయి. ‘వీడు వస్తే మాకు రాజకీయ భవిష్యత్ ఉండదు’ అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. సొంత పార్టీలోనే నన్ను తొక్కే ప్రయత్నాలు చేశారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు’.

- పార్టీ మారుమని ప్రలోభాలు.. 
నాపై కేసులు పెట్టి వేధించిన సందర్భాల్లో పార్టీ మారితే కేసులన్నీ మాఫీ చేస్తామని చాలా ప్రలోభాలు పెట్టారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, సొంత పార్టీ కాంగ్రెస్‌లోనూ కొట్లాటలు ఉన్నాయంటూ పార్టీ మారాలని రాత్రిళ్లు ఇంటికి వచ్చి మరీ కొందరు అడిగేవారు. నాపై ఇప్పటికీ 54 కేసులు ఉన్నాయి. మర్డర్‌ కేసులోనూ ఇరికించారు. కుటుంబంలో విషాదం జరిగిన సమయంలో కూడా కేసుల కారణంగా తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ‘ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. నేను పార్టీ మారను అని చెప్పా. నా మెడలో కాంగ్రెస్‌ కండువా తప్ప మరో కండువాను నేను ఊహించుకోలేదు’. మర్డర్‌ కేసులో ఇరికించిన సమయంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలో మాదిరిగా పోలీసులకు చిక్కకుండా తిరిగాను. ఆ ఘటనలను ఎన్నటికీ మరిచిపోలేను. 

- ‘వేస్ట్‌ గాళ్ల వల్లే ఆ పార్టీ బతుకుతోంది’ 
పార్టీ మారమనే ఒత్తిళ్ల నేపథ్యంలో ఒక పెద్దమనిషి తన గురించి చేసిన వ్యాఖ్య గుర్తొస్తుంది. ‘ఇలాంటి వేస్ట్‌ గాళ్ల వల్లనే ఆ పార్టీ ఇంకా బతుకుతోంది’ అని ఆ పెద్దమనిషి అన్నారు. అది తిట్టు లాంటి పొగడ్తగా భావించాను.

- రాహుల్‌ నుంచి నేరుగా ఫోన్‌.. 
ఒక రోజు కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా రాహుల్‌గాంధీ నుంచి ఫోన్‌ వచ్చింది. ఢిల్లీకి రావాలని పిలిచారు. దేశవ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేస్తే తెలంగాణ నుంచి నన్ను ఒక్కరినే సమావేశానికి పంపించారు. సమావేశంలో నాకు 45 నిమిషాల సమయం ఇచ్చారు. డీసీసీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అప్పుడే సూచించాను. ఇప్పుడు రాహుల్‌గాంధీ వాటిని అమలు చేస్తున్నారు. మరోసారి రాహుల్‌గాంధీ, కొప్పుల రాజు ఆన్‌లైన్‌లో డీసీసీ సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడమన్న వారే మాట్లాడాలని నిబంధన ఉండేది. అప్పుడు రాహుల్‌గాంధీ ‘నాయిని రాజేందర్‌రెడ్డి జీ మాట్లాడండి’ అని తనను పిలవడం ఎంతో గర్వంగా అనిపించింది.

- మానాన్నను డబ్బులు అడగడం మానేశా.. 
ఇంటర్‌లో ఉన్న సమయంలో చదువు అబ్బడం లేదని, బిజినెస్‌ చేసుకుంటానని డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాను. ఆయన డబ్బులు ఇవ్వనని చెప్పారు. అప్పటి నుంచి తండ్రిని డబ్బులు అడగడమే మానేశా.

- ‘నాకు పిల్లనియ్యలే’.. 
తాను రఫ్‌గా ఉండేవాడిని. నాపై రెండు కేసులు నమోదవడంతో ‘నరేందర్‌రెడ్డి పెద్ద కొడుకుపై మర్డర్‌ కేసు అయిందట’ అంటూ ప్రచారం జరిగింది. దీంతో చుట్టాలు, పక్కాలు కూడా అదే విషయాన్ని మాట్లాడుకునేవారు. అప్పట్లో పట్టింపులు ఎక్కువగా ఉండేవి. కేసులు ఉన్నాయనే కారణంతో నాకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.

- అప్పటి రాజకీయాలు వేరు.. 
ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. దీనికి ఉదాహరణగా నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఓంకార్‌ ఘటన. ఓంకార్‌పై ఫైరింగ్ జరగడంతో ఆయన్ను ఎంజీఎంకు తీసుకొచ్చారు. నర్సంపేట నుంచి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అప్పటికే రాజకీయాల్లో హత్యలు కూడా జరిగేవి. హయగ్రీవాచారిని ప్రత్యర్థులు ‘హత్యలాచారి’ అని పిలిచేవారు. అయినప్పటికీ హయగ్రీవాచారి ఎంజీఎంకు వెళ్లి ఓంకార్‌ను పరామర్శించారు. అంతా మా మీద దాడి చేస్తారనుకున్నాం. కానీ అంత మంది ఆయనను చూసి దారి ఇవ్వడం గొప్పగా అనిపించింది.  ‘అప్పుడు అలాంటి రాజకీయ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎవరో పోటీకి వస్తాడేమోనని ముందే శత్రువుగా చూస్తున్నారు’.
- పావలా ఇడ్లీ నుంచి వెయ్యి రూపాయల ఇడ్లీ వరకు.. 
నా రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలన్నీ గొప్పవే. పోరాటంలో ఉన్న సమయంలో పావలా ఇడ్లీ తిన్నాను. ఇప్పుడు వెయ్యి రూపాయల ఇడ్లీ తినే స్థాయికి వచ్చాను. కానీ అప్పుడున్న రాజకీయ సంస్కారం ఇప్పుడు లేదు’.

- వరంగల్‌ బ్రాండ్‌ పెంచడమే లక్ష్యం.. 
నా నియోజకవర్గ పరిధికే పరిమితం కాకుండా వరంగల్‌ బ్రాండ్‌ను పెంచే పనులకు ముఖ్యమంత్రి వద్ద నిధులు అడిగాను. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్టు, రింగ్‌రోడ్డు వంటి పనులు చేపట్టాలని కోరాను. రూ.500 కోట్లతో వాటర్‌ సప్లై పైప్‌లైన్‌ను మెరుగుపరుస్తున్నాం. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులు ప్రారంభించాం. ఐటీఐ కాలేజీకి రూ.30 కోట్లు తీసుకొచ్చా. కాజీపేట బ్రిడ్జి పనులు తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతే వేగం పుంజుకున్నాయి. త్వరలోనే పనులు పూర్తి చేస్తాం. కాజీపేట బస్టాండ్‌ కూడా మంజూరు చేయించా. త్వరలోనే నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది.

- ‘నాకు ఏది వచ్చినా బోనస్సే’ 
అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక ఉండేది. అది నెరవేరింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలని అడిగాను. ‘నాకు పార్టీ పని చేయడం అంటే ఇష్టం. అందుకే నేను పార్టీ పదవి అడిగాను. పెద్దలు ఏ పదవి ఇచ్చినా నాకు బోనస్సే’.

- బిడ్డకు టికెట్‌ ఇస్తే.. బరిలోకి 
నా రాజకీయ వారసురాలు బిడ్డ. నా బిడ్డ గోదాదేవి మంచి డాక్టర్. ఆమె 2014లో కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకుంది. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో కీలకంగా పనిచేస్తోంది. 240 మంది బీఎల్‌ఓలు, 240 బీఎల్‌ఏలను సమన్వయం చేసింది. ప్రత్యేక వింగ్‌ ఏర్పాటు చేసి వరంగల్‌ పశ్చిమలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓట్లు కోల్పోకుండా పనిచేస్తోంది. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే గోదాదేవి తప్పకుండా పోటీ చేస్తుంది.

- కార్పొరేషన్‌ రిజర్వేషన్లు మారొచ్చు.. 
డిసెంబర్‌ లేదా జనవరిలో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నేపథ్యంలో మరోసారి మేయర్ రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజన కూడా జరగనుంది. డివిజన్ల సంఖ్య 66 నుంచి 80కి కూడా పెరిగే అవకాశం ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయం.

Tags:

పోరాటమే నా పునాది

- 2023 ఎన్నికల్లో గెలిచి లక్ష్యాన్ని ముద్దాడ - నాకు ఏ పదవి వచ్చినా బోనస్సే - వరంగల్ బ్రాండ్ పెంచటమే లక్ష్యం - నా రాజకీయ...
రాజకీయం 
Read More...
పోరాటమే నా పునాది

పాలిటిక్స్ లో 'దయన్న' మార్క్

- మా నాన్నకు నన్ను డాక్టర్ ను చేయాలనే కోరిక ఉండేది - నాకు మాత్రం చదువు కంటే ఎక్కువ రాజకీయాలపై ఇష్టం ఉండే- కక్షసాధింపు...
రాజకీయం 
Read More...
పాలిటిక్స్ లో 'దయన్న' మార్క్

అవమానం పెంచిన కసి

- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ - కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం- చలివాగు బ్రిడ్జి పనుల...
రాజకీయం 
Read More...
అవమానం పెంచిన కసి

రూ.1.25 కోట్ల గంజాయి సీజ్

- అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్- దామెర పోలీసుల భారీ ఆపరేషన్- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం- వరంగల్ సీపీ...
క్రైమ్ 
Read More...
రూ.1.25 కోట్ల గంజాయి సీజ్

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం..   తెరుచుకోని హాస్పిటల్‌ డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు అక్షరదర్బార్,పరకాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)...
Read More...
ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల