పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ
- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్
- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న
- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది అధిష్టానమే”నని వ్యాఖ్య
- సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఆరాటమని ఆరోపణ
పరకాల కాంగ్రెస్‌లో పొలిటికల్ సెగ
- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్
- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న
- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది అధిష్టానమే”నని వ్యాఖ్య
- సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఆరాటమని ఆరోపణ
అక్షరదర్బార్, గీసుకొండ:
కాంగ్రెస్ పార్టీలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాజా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఈనెల 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఘాటుగా స్పందించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో పాల్గొన్న కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
- అప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు?
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే, అప్పుడే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని సుస్మిత ప్రశ్నించారు. “పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఆయన గెలిచారంటే అది కొండా కుటుంబం చేసిన సహకారం వల్లే. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసేది నేనే” అని ఆమె స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌లో మొదట అడిగింది కొండా దంపతులేనని గుర్తుచేసిన ఆమె, పీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్ తన మాట మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిచినా, ఓడినా కొండా మురళికి ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు దానిని నెరవేర్చలేదని మండిపడ్డారు.
- డైపర్లు వేసుకునే స్థితిలో ఉన్నవారికి టికెట్ ఇస్తారా?
ఒకవైపు ‘జీన్ జీ’లకు (యువతకు) టికెట్లు ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి, మరోవైపు డైపర్లు వేసుకునే స్థితిలో ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తాననడం ఏంటని సుస్మిత ఎద్దేవా చేశారు. పార్టీలో టికెట్ల కేటాయింపును అధిష్టానం నిర్ణయిస్తుందని, అలాంటప్పుడు పరకాల టికెట్‌పై రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పార్టీలో ఆయన ఒక్కడే ఉన్నారా అని నిలదీశారు. బీసీలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత చులకన భావమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- పొంగులేటిపైనా ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సుస్మిత, “రేవంత్ రెడ్డితో పాటు ఒక పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువసేపు ఉండదు. అసలు మీరే ముఖ్యమంత్రో లేక ఆయనే ముఖ్యమంత్రో తేల్చుకోండి” అంటూ ఘాటుగా విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల జాతరలో సీఎం ఫొటోతో పాటు పొంగులేటి ఫొటో పెట్టారని, కానీ ఫ్లెక్సీలలో సమాచార శాఖ మంత్రి ఫొటో వేయలేదని ఆక్షేపించారు. బీసీ నేతల కంటే పొంగులేటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.