జనసభలోనే నా ప్రయాణం!

జనసభలోనే నా ప్రయాణం!

- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం

జనసభలోనే నా ప్రయాణం!

- పదిహేను రోజుల వ్యవధిలోనే పోటీ చేసినా పట్టభద్రులు ఆదరించారు 
- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం
- పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో ముందడుగు
- ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని పర్యటించా
- నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడుతుంది 
- నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల బతుకులు బుగ్గిపాలు
- నిరుద్యోగం అతిపెద్ద సామాజిక సమస్య..
- యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట 'జాబ్ క్యాలెండర్' తక్షణ అవసరం 
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 
- పీఆర్సీ, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం
- రెండున్నరేళ్లుగా ప్రజాక్షేత్రంలోనే పట్టభద్రుల హక్కుల కోసం పోరాడుతున్న
- రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదు
- రాబోయే బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి వారధిగా నిలుస్తా
- కేటీఆర్ నాయకత్వమే జెన్- జీ తరానికి దిక్సూచి
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి 


అక్షరదర్బార్, హనుమకొండ: రాజకీయాల్లో గెలుపోటములు సహజమైన పరిణామాలని, చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకపోయినా 'జనసభ'లో ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. ఓటమితో ఎక్కడా నిరాశ చెందలేదని, పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో గత రెండున్నరేళ్లుగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని ఆయన చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరిన కొద్దిరోజులకే పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి గత ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కేవలం 15 రోజుల ముందు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని రాకేష్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల పట్టభద్రులు విశేషంగా ఆదరించారన్నారు. ఆ ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో ఓటమి చెందిన తర్వాత కేసీఆర్ తనను పిలిచి మాట్లాడి "గో హెడ్ రాకేష్.." అంటూ ఇచ్చిన ధైర్యం, మార్గదర్శకత్వమే తనను ప్రజాక్షేత్రంలో ముందుకు నడిపిస్తోందన్నారు. చట్టసభలోకి వెళ్లలేకపోయాననే బాధ కంటే జనసభలో పనిచేసే అవకాశం లభించిందనే భావనతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.  తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాకేష్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన పోరాటాలను వివరించారు. ఏమన్నారంటే ఆయన మాటల్లో...

- రెండున్నరేళ్లుగా నిరంతర పోరాటం..

గత రెండున్నరేళ్లుగా విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న. జీఓ 46, జీఓ 29, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వివాదాలు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, నిలదీశాం. ప్రభుత్వ తీరును ప్రజల ముందుకు తీసుకెళ్లే క్రమంలో పలుమార్లు నిర్బంధాలకు గురైనా వెనుకడుగు వేయలేదు. ఉద్యోగులకు సంబంధించిన అత్యంత కీలకమైన సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్న. నిరుద్యోగ బాకీ కార్డు ఉద్యమం చేపట్టాం. జలవిహార్‌లో భారీ సభ నిర్వహించాం, యువసంగ్రామం సభ చేపట్టాం. హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన. ఆయా ప్రాంతాల్లో విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ ఉద్యోగులను కలిసి వారి సమస్యలను దగ్గరగా తెలుసుకున్న. ఈ రెండున్నరేళ్ల కాలంలో నాకు ఎంతో అనుభవం, పరిణతి లభించింది.

నిరుద్యోగం ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. యూపీఎస్సీ తరహాలో నిర్దిష్టమైన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే వ్యవస్థ రాష్ట్రంలో లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఏళ్ల తరబడి పట్టణాల్లో అద్దె గదుల్లో ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

హన్మకొండలోని సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లి చూస్తే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. నిరుద్యోగులు రూ.5 భోజనంతో రోజులు గడుపుతున్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ చాలామంది నిరుద్యోగులు వయసును కోల్పోతున్నారు. ఉద్యోగం లేక, చేతిలో పని లేక, సొంతంగా భూమి లేక, తల్లిదండ్రుల కష్టాలు కళ్లముందు కనిపిస్తూ, బంధువుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనేక మంది దిక్కుతోచని పరిస్థితికి వెళ్తున్నారు. పెళ్లిళ్లు కూడా కాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాంతానికి చెందిన వేణు ఆత్మహత్య నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన రాసిన సూసైడ్‌ లెటర్‌ చదివితే గుండె తరుక్కుపోతుంది. ఈ దారుణ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.

- కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి..

రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కూడా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, అందులో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే. వారి సమస్యలపై విస్తృతంగా అధ్యయనం చేశాను. వారి కష్టాలను దగ్గర నుంచి చూశాను.

పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు లభించడం లేదు. కొద్దిపాటి జీతాలు కూడా నెలనెలా అందడం లేదు. రెండు నెలలు, మూడు నెలలు.. ఒక్కోసారి ఐదారు నెలలకు ఒకసారి వేతనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు ఎలా జీవించాలి? పిల్లలను ఎలా చదివించాలి? సమాజంలో గౌరవంగా ఎలా జీవించాలి?. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది‌ అయితే ఒకటో తేదీన జీతం పొందడం ఉద్యోగుల హక్కు. జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారికి భద్రత కల్పించాలి. నెలనెలా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

- శిఖర సమాన నేత కేసీఆర్‌.. జెన్‌జీకి సరైన నాయకుడు కేటీఆర్‌..

కేసీఆర్‌ శిఖర సమాన నాయకుడు. తెలంగాణ సమాజం ఏ సమస్యల నుంచి, ఏ బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుందో, ఏ ఆత్మగౌరవం కోసం పోరాడిందో వాటన్నింటికీ స్వరాష్ట్రంలో పరిష్కారం చూపేందుకు అద్భుతమైన కార్యాచరణతో ముందుకు నడిపించిన మహానేత కేసీఆర్‌. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తిరగని ఊరు లేదు. పలకరించని పల్లె లేదు. తొక్కని గడప లేదు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అద్భుతమైన పాలన అందించారు.

పదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేశారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేయించారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, దళితుల కోసం దళితబంధు వంటి కార్యక్రమాలు అమలు చేశారు. కార్మికుల కోసం అనేక పథకాలు, అన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీ, విద్యారంగ బలోపేతం, వృత్తుల ప్రోత్సాహం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు.

జెన్‌జీ తరానికి కేటీఆర్‌ సరైన నాయకుడు. నేటి తరం సమస్యలు, వాటి పరిష్కారాలపై ముందుచూపుతో కేటీఆర్‌ పనిచేశారు. టీ-హబ్‌, టీఎస్‌ఐపాస్‌, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా పదేళ్ల క్రితమే జెన్‌జీ తరం గురించి ఆలోచించారు. రాజకీయాలను కొత్త కోణంలో చూడాలని, నేటి తరానికి చేరువ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని నిరంతరం ఆలోచించే విలక్షణ నాయకుడు కేటీఆర్. అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకురావడంలో, హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

- ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్‌ ప్రభుత్వమే ఇచ్చింది..

తెలంగాణ ఏర్పాటుతో ప్రజలు కోరుకున్న ఆకాంక్షలను పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో నిజం చేశాం. అన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాం. పోలీసు, ఉపాధ్యాయ, ఇతర శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కలలను నిజం చేశాం. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టి అనేక ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాం. అయితే బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో విడుదలైన అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్నికల కోడ్‌ వంటి కారణాలతో ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీ చేస్తూ తామే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. మేము పోరాడిన తర్వాత ఇటీవల కొన్ని పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసింది. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. అబద్ధాల మీద ప్రభుత్వం నడుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.

గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్నా. రామకోటి రాసిన దానికంటే ఎక్కువగా గత రెండేళ్లలో విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించాను. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అధిష్ఠానం మరోసారి అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం తేలిపోతుంది. రాబోయే బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి వారధిగా నిలుస్తా.

- బిట్స్‌ పిలానీలో డ్యుయెల్‌ డిగ్రీ.. ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి

మాది గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ గ్రామం. తల్లిదండ్రులు ఏనుగుల కోమల, గోపాల్‌రెడ్డి. వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను పదో తరగతి వరకు వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో, ఇంటర్‌ గుంటూరులోని విజ్ఞాన్‌ కాలేజీలో చదివాను. ఇంటర్‌లో స్టేట్‌ తొమ్మిదో ర్యాంకు సాధించడంతో బిట్స్‌ పిలానీలో అడ్మిషన్‌ లభించింది. అక్కడ ఐదేళ్ల డ్యుయెల్‌ డిగ్రీ పూర్తి చేసి, విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. అనంతరం ఏడేళ్ల పాటు బెంగళూరు, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను.

విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలతో ఉన్న నేను 2013లో బీజేపీలో చేరాను. అనంతరం పదేళ్లపాటు వరంగల్‌లో బీజేపీ బలోపేతానికి కీలకంగా పనిచేశాను. ముఖ్యంగా మురికివాడల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాను‌. వరదల సమయంలో ఇంటింటికీ వెళ్లి తనవంతు సహాయం అందించాను. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్‌లో చేరాను.

Tags:

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం..   ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడి వేడుకోలు అక్షరదర్బార్, నడికూడ: నడికూడ మండలంలోని కంటాత్మకూరు...
Read More...
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

జనసభలోనే నా ప్రయాణం!

- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం
రాజకీయం 
Read More...
జనసభలోనే నా ప్రయాణం!

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం టీపీయూఎస్‌ జిల్లా స్థాయి పురస్కారాలు అక్షరదర్బార్ నడికూడ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) వరంగల్‌–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం...
Read More...
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మూడు తరాలుగా సేవా సంకల్పం

మూడు తరాలుగా సేవా సంకల్పం ‘సేవా సంకల్ప్ అభియాన్‌’లో డా. సిరంగి సౌందరయ్య మనవడు రక్తదానం అక్షరదర్బార్,పరకాల: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల...
Read More...
మూడు తరాలుగా సేవా సంకల్పం

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం! హుండీ మాయం..   23 నుంచి పనిచేయని సీసీ కెమెరాలు  పోలీసులకు సమాచారం అక్షరదర్బార్, పరకాల: పరకాల ప్రాంతంలోని ప్రముఖ మల్లక్కపేట అభయాంజనేయ...
Read More...
మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!