'మహా' రూపురేఖలు

'మహా' రూపురేఖలు

- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!

'మహా' రూపురేఖలు 

- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!
- పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం
- అశోక హోటల్‌ ఎదురుగా 'మల్టీలెవల్‌ పార్కింగ్‌'
- హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌కు ప్లాన్ 
- రూ.5 వేల కోట్లతో అండర్‌ డ్రైనేజీ పనులకు సన్నాహాలు 
- రూ.500 కోట్లతో తాగునీటి సరఫరా టెండర్ ప్రక్రియ పూర్తి
- చెత్త రహిత నగరం కోసం బయో మైనింగ్, బయో సీఎన్జీ ప్లాంట్లు
- భద్రకాళి, వరంగల్‌ కోట, దేవునూరు గుట్టలపై ప్రత్యేక దృష్టి
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్ పర్సన్ చాహత్‌ బాజ్‌పాయ్


అక్షరదర్బార్, హనుమకొండ 

నగరంలో పెరుగుతున్న పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు హనుమకొండలో మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్ పర్సన్ చాహత్‌ బాజ్‌పాయ్ వెల్లడించారు. హనుమకొండలో అశోక హోటల్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ముందు భాగాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించేలా రూపకల్పన చేస్తున్నామని ఆమె తెలిపారు. అదే తరహాలో హనుమకొండ చౌరస్తాలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే ఆలోచన ఉందన్నారు. నగర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చాహత్ బాజ్ పాయ్ చెప్పారు. మంగళవారం తన చాంబర్‌లో డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జిల్లా, నగర అభివృద్ధి పనులపై ఆమె వివరాలు వెల్లడించారు. 

- అశోక హోటల్‌ ఎదురుగా మల్టీలెవల్‌ పార్కింగ్‌

హన్మకొండలో పార్కింగ్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అశోక హోటల్‌కు ఎదురుగా ఉన్న కుడా స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పార్కింగ్‌ కోసం మాత్రమే స్థలాన్ని వినియోగించకుండా ముందు భాగంలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేసి లీజుకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని వివరించారు. పార్కింగ్‌ సమస్య పరిష్కారంతో పాటు నగరంలోని వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 

- హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌

హన్మకొండ చౌరస్తాను సమగ్రంగా రీడెవలప్‌మెంట్‌ చేయాలనే ఆలోచన ఉందని కలెక్టర్‌ తెలిపారు. చౌరస్తాలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కలుపుకొని ప్లాజా నిర్మాణం చేపట్టే ప్రతిపాదనపై ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. నగరానికి మరింత ఆకర్షణ తీసుకురావడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా, వాణిజ్య వసతులు కల్పించేలా చౌరస్తా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమన్నారు. మల్టీలెవల్‌ పార్కింగ్‌, ప్లాజా నిర్మాణం పూర్తయితే హన్మకొండ ప్రధాన కూడలిలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని వివరించారు. 

- అండర్‌ డ్రైనేజీకి రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు

హన్మకొండ, కాజీపేటతో పాటు గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అండర్‌ డ్రైనేజీ పనులకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ కొనసాగుతోందని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దాదాపు 10 ఎకరాల భూమిని గుర్తించామని చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పనులను ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. అండర్‌ డ్రైనేజీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సంబంధిత అధికారులు పరిశీలన చేస్తున్నారని తెలిపారు. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేయనున్నామని చెప్పారు. 

- తాగునీటి వ్యవస్థకు రూ.500 కోట్లు

గ్రేటర్‌ వరంగల్‌ వాటర్‌ వర్క్స్‌ అభివృద్ధికి ప్రభుత్వం కొత్తగా రూ.500 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్‌ తెలిపారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిధులతో పనులు చేపట్టనున్నామని చెప్పారు. కొత్త పైపులైన్ల నిర్మాణం, పాత పైపులైన్ల మరమ్మతులు, నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, కొత్త నిర్మాణాలు, వాటర్‌ ట్యాంకులు, వాటర్‌ ప్లాట్ల ఏర్పాటు వంటి పనులకు నిధులను వినియోగించనున్నామని వివరించారు. నగరంలో 30, 40 ఏళ్ల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి త్వరలోనే ఈ పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారని చెప్పారు. 

- భద్రకాళి, వరంగల్‌ కోటకు పర్యాటక హంగులు

భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.90 కోట్ల ఎస్డీపీ నిధులు కేటాయించిందని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. భద్రకాళి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భద్రకాళి బండ్‌ వద్ద స్టోన్‌ వర్క్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందుకోసం రూ.19 కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులను ఆయనకు చూపించే ఆలోచన ఉందన్నారు.

- వరంగల్ కోట చుట్టూ..
వరంగల్‌ కోట చుట్టూ ఉన్న సుమారు 4 కిలోమీటర్ల రక్షణ కందకాన్ని పునరుద్ధరించి బోటింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఖిలా వరంగల్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. నగరంలో ముంపు సమస్యను తగ్గించేందుకు రిటర్న్‌ వాల్‌, డ్రైనేజీలు, నాలాల అభివృద్ధి పనులు కూడా చేపట్టామని వివరించారు. 

- దేవునూరు గుట్టలు టూరిజం స్పాట్‌గా

ధర్మసాగర్‌ మండలంలోని దేవునూరు గుట్టలను అటవీశాఖ సహకారంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉందని కలెక్టర్‌ తెలిపారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌తో పాటు అటవీ విస్తీర్ణం ఉన్న దేవునూరు గుట్టలను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీనిపై గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారని, ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. 

- డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్వహణపై దృష్టి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రగతిలో ఉందని, పనుల్లో మరింత వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ వందశాతం పూర్తయిందని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి, డ్రైనేజీ సమస్యలు లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. అంబేద్కర్‌నగర్‌లోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కార్పొరేషన్‌ అధికారులు టెండర్లు పిలిచారని, త్వరలో పనులు పూర్తవుతాయని చెప్పారు. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అనే అంశంపై ఆక్యుపెన్సీ వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారు ఇళ్లను వినియోగించుకోవాలన్నదే ఈ ప్రక్రియ ఉద్దేశమన్నారు. 

- బయోమైనింగ్‌, పారిశుధ్యానికి ప్రాధాన్యం

నగరంలో శానిటేషన్‌ క్లియరెన్స్‌ను సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. చెత్తను డంపింగ్‌ చేయకుండా బయోమైనింగ్‌, బయో సీఎజీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. డంపింగ్‌ యార్డు విషయంలో కొత్తగా వెతుకులాట చేయడం లేదని, అందుబాటులో ఉన్న వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 

- అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా చర్యలు

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించామని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. బూత్‌ లెవల్‌ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని వెల్లడించారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. 

- ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో సివిల్స్‌లోకి

మధ్యప్రదేశ్‌లోని గుణలో టెన్త్‌ వరకు చదువుకున్నానని, ఇంటర్‌ విద్యను గ్వాలియర్‌లో పూర్తి చేశానని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. 2016లో ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశానని చెప్పారు. తన తండ్రి ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారని, ఆయన ఉన్నతాధికారులతో పనిచేసిన అనుభవాలు, కలెక్టర్‌ స్థాయి బాధ్యతల గురించి చెప్పే విధానం తనపై ప్రభావం చూపిందన్నారు. ప్రజలకు ఎక్కువగా సేవ చేసే అవకాశం సివిల్‌ సర్వీసుల్లో ఉంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేశానని తెలిపారు. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరంలోనే తొలిసారి సివిల్స్‌ పరీక్ష రాశానని, మూడో ప్రయత్నంలో విజయం సాధించానని చెప్పారు. సివిల్స్‌ శిక్షణ సమయంలోనే వరుణ్‌ రెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

Tags:

'మహా' రూపురేఖలు

- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!
వార్తలు 
Read More...
'మహా' రూపురేఖలు

కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!

కాలేజీ గ్రౌండా.. నీటి! చినుకు పడితే చిత్తడే..  విద్యార్థులు, వాకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎలిఫ్యాడ్‌ కోసం వేసిన సీసీని తొలగించకుండా వదిలేయడంతో సమస్య అక్షరదర్బార్, పరకాల:పరకాల...
Read More...
కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి   గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి అక్షరదర్బార్,పరకాల:  సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బీజేపీ...
Read More...
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!