పరకాలను అభివృద్ధి చేయాలి
పరకాలను అభివృద్ధి చేయాలి
సీఎం సభకు రూ.30 లక్షలు ఖర్చు..
పరకాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
అక్షరదర్బార్,పరకాల:
పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పరకాలకు వచ్చిన సందర్భంగా మున్సిపాలిటీ నుంచి సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేయడం వృథా అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనలో పరకాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌తో కలిసి పలు అంశాలను ప్రశ్నించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పట్టణంలోని 22 మంది కౌన్సిలర్లకు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల ఆయన ప్రశ్నలు సంధించారు. అభివృద్ధి పనుల విషయంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య పంపకాలపై ఏమైనా విభేదాలు తలెత్తాయా? అని ప్రశ్నించారు.
పరకాలను జంక్షన్‌గా తీర్చిదిద్దాలి
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ఎగ్జిట్ కనెక్షన్ కల్పించి పరకాలను ప్రధాన జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని సమావేశంలో కోరినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనకు పరకాల ఎమ్మెల్యే కూడా అంగీకారం తెలిపారని పేర్కొన్నారు.
ఏఎంసీ మార్కెట్‌కు ఆధునిక హంగులు
పరకాల వ్యవసాయ మార్కెట్‌ను ఏ-1 మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని, రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ నిర్మించాలని కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై కూడా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని చెప్పారు.
100 పడకల ఆస్పత్రి ప్రారంభించాలి
పరకాలలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. నర్సంపేట తరహాలో పరకాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరారు. పరకాలకు గత వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు ఎంత అభివృద్ధి చేస్తారో చేయాలని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పరకాలను మరింత అభివృద్ధి చేస్తుందని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.