ప్రశ్నించటమే నా బలం
- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో ఉన్న.. నిర్బంధాలే నన్ను నిలబెట్టాయి
- అప్పట్లో నా రాజకీయ గురువు సుధాకర్ గాంధీ
- కాంగ్రెసే నా శ్వాస.. పార్టీ కోసం ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయా
- అయినా పార్టీ అధిష్టానాన్ని ఏనాడూ ధిక్కరించలే
- పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటా.. కష్టాలు వస్తే పారిపోయే రకం కాదు
- ప్రశ్నించకపోతే సమస్యలు పరిష్కారం కావు.. ప్రజల పక్షాన నిలబడటమే నా పునాది
- రైతు సంక్షేమమే నా ధ్యేయం
- మేయర్ తో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటా
- డీలిమిటేషన్ తర్వాతే నియోజకవర్గంపై నిర్ణయం
- రిజర్వేషన్ నాకు కలిసి రాకపోతే బరిలోకి నా కూతురు నిఖితారెడ్డి
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో సీనియర్ కాంగ్రెస్ నేత, ఆయిల్ ఫెడ్ తాజా మాజీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి
ప్రశ్నించటమే నా బలం
- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో ఉన్న.. నిర్బంధాలే నన్ను నిలబెట్టాయి
- అప్పట్లో నా రాజకీయ గురువు సుధాకర్ గాంధీ
- కాంగ్రెసే నా శ్వాస.. పార్టీ కోసం ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయా
- అయినా పార్టీ అధిష్టానాన్ని ఏనాడూ ధిక్కరించలే
- పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటా.. కష్టాలు వస్తే పారిపోయే రకం కాదు
- ప్రశ్నించకపోతే సమస్యలు పరిష్కారం కావు.. ప్రజల పక్షాన నిలబడటమే నా పునాది
- పీఏసీఎస్ నుంచి ఆయిల్ ఫెడ్ వరకు అడుగడుగునా రైతు సంక్షేమమే నా ధ్యేయం
- గ్రేటర్ వరంగల్ మేయర్ స్థానంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటా
- డీలిమిటేషన్ తర్వాతే నియోజకవర్గంపై నిర్ణయం
- రిజర్వేషన్ నాకు కలిసి రాకపోతే బరిలోకి నా కూతురు నిఖితారెడ్డి
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో సీనియర్ కాంగ్రెస్ నేత, ఆయిల్ ఫెడ్ తాజా మాజీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి
అక్షరదర్బార్, హనుమకొండ
మాది టేకులగూడెం విలేజ్. కాంగ్రెస్ కుటుంబం. నాన్న సర్పంచ్ గా పనిచేశారు. ప్రజలు యునాన్మస్ గా ఎన్నుకున్నరు. నేను విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పనిచేశా. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ఎదిగినవాడిని. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయే వ్యక్తిని కాదు. పదవులు ఉన్నా లేకపోయినా, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్యే ఉంటున్న. నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ తాజా మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఒక మాట మాత్రం స్పష్టంగా చెబుతున్నా.. జంగా అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో నాకంటూ ప్రత్యేకంగా పనిచేసే కార్యకర్తల బలం, ఓటు బ్యాంకు ఉందని ఆయన చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో నా పాత్ర కీలకంగా ఉంటుందని జంగా పేర్కొన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో రాఘవరెడ్డి మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానం, ప్రజా ఉద్యమాల్లో అనుభవాలు, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం, రైతుల కోసం చేసిన కార్యక్రమాలు, గ్రేటర్ వరంగల్ రాజకీయాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యం తదితర అంశాలపై జంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. రాఘవరెడ్డి మాటల్లో..
- నిర్బంధాల నుంచే నా రాజకీయ ప్రస్థానం
మొదటి నుంచీ మాది కాంగ్రెస్ పార్టీ కుటుంబమే. అయితే నేను పాఠశాల దశ నుంచే విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన. ప్రజల కోసం పనిచేయడం ప్రారంభించా. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి ప్రభుత్వాల నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నా. పోలీసుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఆ నిర్బంధాలు, ప్రజా ఉద్యమాలే నన్ను నాయకుడిగా తీర్చిదిద్దాయి. విద్యార్థి దశలో నా రాజకీయ గురువు సుధాకర్‌గాంధీ. ఆయన వల్లే నేను ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం నేర్చుకున్నా. ప్రశ్నించకుండా ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ప్రజల కోసం ప్రశ్నించినప్పుడే ప్రజలు మన వెంట నడుస్తారు. అదే నమ్మకంతో ఇన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. నిర్బంధాలు, కేసులు, కష్టాలు వచ్చినప్పుడల్లా వెనక్కి వెళ్లకుండా మరింత బలంగా పనిచేశా. ప్రజల మధ్య ఉండటం, ప్రజల సమస్యలపై పోరాడటం నా రాజకీయ జీవితానికి మొదటి నుంచీ పునాది.
- రెండుసార్లు ఏకగ్రీవంగా గెలిచా
కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా పనిచేస్తూనే రాజకీయాల్లోకి వచ్చా. సీరియస్ పొలిటిషియన్‌గా మారిన తర్వాత కాజీపేట దర్గా పీఏసీఎస్ చైర్మన్‌గా రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశా. ఆ సమయంలో జిల్లా రైతులకు మేలు చేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టా. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశా. డీసీసీబీని మరింత బలోపేతం చేయడానికి కూడా పనిచేశా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు అహర్నిశలు పనిచేశా. రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేలా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించా. తెలంగాణవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు పెరిగింది. రైతులకు అది ఎంతో లాభదాయకమైన పంటగా మారుతోంది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే నా లక్ష్యం. ఏ పదవిలో ఉన్నా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నదే నా ఆలోచన.
- ప్రత్యేకంగా పనిచేసే సైన్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్‌ఘనపూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటలో నాకు ప్రత్యేకంగా పనిచేసే సైన్యం ఉంది. నాకంటూ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో నా పాత్ర కూడా ఉంటుంది. జంగా అంటే ఒక వ్యక్తి కాదు.. వివిధ నియోజకవర్గాల్లో ప్రజలతో నాకు ఉన్న అనుబంధం, కార్యకర్తల బలం కలిసిన రాజకీయ శక్తి.
- గ్రేటర్ మేయర్ రేసులో ఉన్నా
అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. పార్టీపై నాకు చాలా విశ్వాసం ఉంది. గ్రేటర్ వరంగల్ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం ఉంది. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నా. నాకు రిజర్వేషన్ కలిసి రాకపోతే నా కూతురు డాక్టర్ నిఖితారెడ్డి బరిలో ఉంటుంది. గ్రేటర్ వరంగల్ ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నా. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నా. మహిళలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సీరియస్‌గా పనిచేస్తున్నా. ప్రజల్లో ఉండటం నాకు కొత్త కాదు. పదవి ఉన్నప్పుడే ప్రజల దగ్గరకు వెళ్లే రాజకీయ నాయకుడిని కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటా.
- వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నా టార్గెట్
దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తెలంగాణలో కూడా నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల స్వరూపం కూడా మారవచ్చు. డీలిమిటేషన్ అంశాన్ని నేను ఆసక్తిగా గమనిస్తున్నా. నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరుగుతుందనే దానిపైనే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆధారపడి ఉంటుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా బరిలో ఉంటా. ఎక్కడి నుంచి అనేది డీలిమిటేషన్ తర్వాత నిర్ణయించుకుంటా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా నా పట్ల సానుకూలంగా ఉన్నారన్న నమ్మకం ఉంది. అనేక ఎన్నికల్లో పార్టీ పెద్దలు, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేశా. ఎక్కడా ధిక్కరించలేదు. ఈ క్రమంలో సీనియర్ నాయకుడిగా రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయా. అయినా పార్టీని వీడలేదు. పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా. వేచి చూస్తున్న. పార్టీ మారే వ్యక్తిని కాదు. నాది ఆ క్యారెక్టర్ కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉంది. డీలిమిటేషన్ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ రిజర్వేషన్ నాకు కలిసి రాకపోతే నా బిడ్డ నిఖితారెడ్డి బరిలోకి దిగుతది.
- ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే
రాజకీయాలతో పాటు పాత్రికేయ రంగం కూడా కొంత కలుషితమైందన్న బాధ నాకు ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు పవర్ పాలిటిక్స్, మనీ పాలిటిక్స్ పెరిగిపోయాయి. దీంతో ప్రజా ప్రయోజనాలు వెనక్కి వెళ్లి వ్యక్తిగత ప్రయోజనాలే ముందుకు వస్తున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయ వ్యవస్థలో వ్యక్తిగత ప్రయోజనాలు పెరగడం మంచిది కాదు. ఇదే సమయంలో పాత్రికేయ రంగంలోనూ కొన్ని మార్పులు వస్తున్నాయి. ఏదేమైనా పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. ప్రజల కోసమే రాయాలి. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించాలి. ప్రజలకు సంబంధించిన అంశాలను నిర్భయంగా రాయాలి. అలా అయితేనే ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలు కూడా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ బాధ్యతలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకం.