కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ
కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ
- జాతీయ పతాకానికి సెల్యూట్ చేయకుండా నిల్చున్న పవన్
- మరోసారి చర్చనీయం
అక్షరదర్బార్,పరకాల:
జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ పవన్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుందని, తాజాగా అమరధామంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లోనూ మున్సిపల్ కమిషనర్ పవన్ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయకపోవటం స్థానికంగా చర్చకు దారి తీసింది. అమరదామంలో ఆగస్టు 15న స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సమయంలో కమిషనర్ సెల్యూట్ చేయలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసి, జాతీయ పతాకాన్ని గౌరవించలేదని ఆరోపించారు. తాజాగా గురువారం పరకాల పట్టణంలోని అమరధామంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పవన్ పాల్గొన్నప్పటికీ పతాకానికి సెల్యూట్ చేయకపోవడం విశేషం. యూనిఫాములో లేని అధికారి జెండా వైపు తిరిగి గౌరవంగా నిలబడితే సరిపోతుంది అయితే ఇక్కడ తనతో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ జెండాకు సెల్యూట్ చేస్తుండగా కమిషనర్ పవన్ సెల్యూట్ చేయకుండా నిల్చుని ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే తరహా ఘటన రెండోసారి చోటుచేసుకోవడంపై పలువురు ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది.