కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!
కాలేజీ గ్రౌండా.. నీటి!
చినుకు పడితే చిత్తడే..
విద్యార్థులు, వాకర్లకు తీవ్ర ఇబ్బందులు
ఎలిఫ్యాడ్ కోసం వేసిన సీసీని తొలగించకుండా వదిలేయడంతో సమస్య
అక్షరదర్బార్, పరకాల:
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం చినుకు పడితే చిత్తడిగా.. భారీ వర్షం కురిస్తే నీటిమడుగుగా మారుతోంది. విద్యార్థులు, పట్టణ ప్రజలు నిత్యం వినియోగించే ఈ మైదానం అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పట్టణ ప్రజలు మైదానంలో వాకింగ్ చేస్తుంటారు. పరకాలతోపాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు వివిధ విద్యాసంస్థలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎలిఫ్యాడ్ కోసం వేసిన సీసీనే సమస్యగా..
పరకాలకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం మైదానంలో సీసీతో ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆ సీసీ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించకుండా అక్కడే పగులగొట్టి వదిలేయడంతో శిథిలాలు పేరుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో పిల్లలు ఆడుకునేందుకు, ప్రజలు వాకింగ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే ప్రాంతంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోతోందని పేర్కొంటున్నారు.
మైదానాన్ని అభివృద్ధి చేయాలి
నూతన డిగ్రీ కళాశాల నిర్మాణంపై దృష్టి సారిస్తున్న అధికారులు, విద్యార్థులు వినియోగించే కళాశాల మైదానాన్ని మాత్రం పట్టించుకోకపోవడం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మైదానంలోని సీసీ శిథిలాలు, వ్యర్థాలను తొలగించి, అవసరమైన చోట మొరం, క్రషర్ డస్ట్ పోసి చదును చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి మైదానాన్ని పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.