పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్!
అక్షరదర్బార్ ఎఫెక్ట్..
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్!
వరికోల్ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు..
నిధుల వినియోగంపై త్వరలో విచారణ
అక్షరదర్బార్,నడికూడ:
పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంపై వరికోల్ ప్రాథమిక పాఠశాలలో తలెత్తిన వివాదం అధికారుల దృష్టికి చేరింది. నిధుల వినియోగంపై ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన విభేదాలు, పాఠశాలలో జరిగిన వాగ్వాదం, పరస్పర ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై ‘అక్షరదర్బార్’లో ‘పీఎం శ్రీ నిధుల పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు!’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగినట్లు సమాచారం.
పీఎం శ్రీ నిధుల వినియోగంపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఉపాధ్యాయులు అనంతరం పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంపై హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి విషయం వెళ్లడంతో నడికూడ మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు పాఠశాలలో జరిగిన ఘటనపై స్పందించారు. గొడవకు సంబంధించిన ఇద్దరు ఉపాధ్యాయులు శరత్, అశోక్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ తెలిపారు.
నిధులపై విచారణకు రంగం సిద్ధం
పీఎం శ్రీ పథకం కింద వచ్చిన నిధుల వినియోగంలో ఏమైనా అవకతవకలు జరిగాయా? నిధులు నిబంధనల ప్రకారం ఖర్చు చేశారా? అనే అంశాలపై త్వరలో విచారణ చేపట్టనున్నట్లు ఎంఈఓ హనుమంతరావు ‘అక్షరదర్బార్’ ప్రతినిధికి తెలిపారు. విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.