అవమానం పెంచిన కసి
- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్
- కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం
- చలివాగు బ్రిడ్జి పనుల వద్ద మొదలైన రాజకీయ ప్రస్థానం
- యువగర్జనకు పరకాల కోసం వరంగల్ నుంచి స్పెషల్ ట్రైన్
- మొదట ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాగా వద్దన్న
- 2009 ఎన్నికల్లో సినిమా సీన్ ను తలపించిన బీఫామ్ ఘటన
- ఓసారి రాజకీయ ప్రత్యర్థుల రాళ్లదాడితో మొక్కజొన్న చేనులో దాక్కున్న
- 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసే అవకాశం
- 'ఇంటింటికి మీ చల్లా' కార్యక్రమంతో ప్రజల్లోకి.. నియోజకవర్గంపై పట్టు
- ప్రత్యేక రాష్ట్రం కోసం 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు
- 2014 ఎన్నికల్లో విజయం సాధించి లక్ష్యాన్ని ముద్దాడ
- ఓ పొలిటికల్ లీడర్ చేసిన అవమానమే నన్ను ఎమ్మెల్యేను చేసింది
- పదేళ్లలో ఎమ్మెల్యేగా రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు
- కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ తీసుకరావడం ఆనందాన్నిచ్చింది
- స్వగ్రామం ప్రగతి సింగారాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాను
- కేసీఆర్ భోళా శంకరుడు.. కేటీఆర్, హరీష్ లతో నాది ప్రత్యేక అనుబంధం
- గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోతున్నం
- డీలిమిటేషన్ లో మూడు ముక్కలైనా.. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం
- ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి
- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిట్ చాట్
అవమానం పెంచిన కసి
- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్
- కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం
- చలివాగు బ్రిడ్జి పనుల వద్ద మొదలైన రాజకీయ ప్రస్థానం
- యువగర్జనకు పరకాల కోసం వరంగల్ నుంచి స్పెషల్ ట్రైన్
- మొదట ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాగా వద్దన్న
- 2009 ఎన్నికల్లో సినిమా సీన్ ను తలపించిన బీఫామ్ ఘటన
- ఓసారి రాజకీయ ప్రత్యర్థుల రాళ్లదాడితో మొక్కజొన్న చేనులో దాక్కున్న
- 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసే అవకాశం
- 'ఇంటింటికి మీ చల్లా' కార్యక్రమంతో ప్రజల్లోకి.. నియోజకవర్గంపై పట్టు
- ప్రత్యేక రాష్ట్రం కోసం 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు
- 2014 ఎన్నికల్లో విజయం సాధించి లక్ష్యాన్ని ముద్దాడ
- ఓ పొలిటికల్ లీడర్ చేసిన అవమానమే నన్ను ఎమ్మెల్యేను చేసింది
- పదేళ్లలో ఎమ్మెల్యేగా రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు
- కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ తీసుకరావడం ఆనందాన్నిచ్చింది
- స్వగ్రామం ప్రగతి సింగారాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాను
- కేసీఆర్ భోళా శంకరుడు.. కేటీఆర్, హరీష్ లతో నాది ప్రత్యేక అనుబంధం
- గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోతున్నం
- డీలిమిటేషన్ లో మూడు ముక్కలైనా.. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం
- ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి
- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిట్ చాట్
అక్షరదర్బార్, హనుమకొండ
మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కూడా వ్యవసాయంలోనే కొనసాగించాలని మా తండ్రికి ఉండేది. నాకు మాత్రం కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండే. ఆ సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా ఫినోలెక్స్ కంపెనీలో ఎంప్లాయ్ గా చేరాను. మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశాను. తర్వాత నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న. ప్రభుత్వ పథకాల అమలుకు పైపులు, మోటార్లను సరఫరా చేసిన. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. అనతి కాలంలోనే స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా ఎదిగాను. ఇందులో భాగంగా మా ఊరి వద్ద వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణానికి సంబంధించి ఓ పొలిటికల్ లీడర్ తనను అవమానపరిచినట్లు మాట్లాడటం వల్ల రాజకీయాల్లోకి వచ్చిన. ఎలాగైనా ఎమ్మెల్యేను కావాలనే కసితో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరానని బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తాను ఆటంకాలెన్ని ఎదురైనప్పటికీ అధిగమిస్తూ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యాన్ని ముద్దాడినట్లు ఆయన తెలిపారు. పదేళ్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగెత్తించినట్లు చల్లా చెప్పారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటమి ఎదురు కావడానికి పోల్ మేనేజ్మెంట్ లో కొన్ని లోపాలు జరిగాయని గుర్తించినట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. డీలిమిటేషన్ లో నియోజకవర్గం మూడుముక్కలైనా ఎక్కడో ఒకచోట నుంచి తాను పోటీ చేయడం ఖాయమని చల్లా స్పష్టం చేశారు. హనుమకొండలోని తన నివాసంలో బుధవారం ధర్మారెడ్డి డిజిటల్ మీడియా చిట్ చాట్ లో తన అనుభవాలను పంచుకున్నారు. ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
- ప్రగతిసింగారం నుంచి ప్రస్థానం
స్వగ్రామం శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం. మాది వ్యవసాయ కుటుంబం. తల్లి సమ్మక్క, తండ్రి మల్లారెడ్డి. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేను పెద్దవాడిని. రెండో తమ్ముడు మరణించాడు, ఇంటర్మీడియట్ కాగానే 18 ఏళ్లకే 1986లో మేనమామ కుమార్తె జ్యోతితో వివాహం జరిగింది. తండ్రి తనను వ్యవసాయంలోనే కొనసాగించాలని భావించినా.. తనకు మాత్రం కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే స్నేహితుడి సహకారంతో ఫినోలెక్స్ కంపెనీలో ‘మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశాను. అప్పట్లో వ్యవసాయ బావులు, పొలాలకు పైప్‌లైన్లు వేసే కార్యక్రమాలు విస్తృతంగా సాగుతుండటంతో ఆ రంగంపై మంచి అవగాహన ఏర్పడింది.
- నంది పైప్స్‌తో వ్యాపారంలోకి
1993లో సొంతంగా నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్స్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న. 1994లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వజలధార, ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించే పథకాలను అమల్లోకి తేవడంతో పైపులు, మోటార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80 శాతం పనుల ఆర్డర్లు నేనే తీసుకున్న. పైపులు, మోటార్ల సరఫరాతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సాన్నిహిత్యం ఉంది. తన అమ్మకాల ప్రతిభను గుర్తించిన నంది పైప్స్ సంస్థ 1997లో మారుతి కారును బహుమతిగా ఇచ్చింది.
- కాంట్రాక్టర్‌గా కొత్త మలుపు
1999లో ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లే మెటీరియల్ కొనుగోలు చేయాలనే విధానం రావడంతో నా వ్యాపారంపై ప్రభావం పడింది. సరఫరా చేసిన మెటీరియల్‌కు బిల్లులు సకాలంలో రాకపోవడం, కొందరు డబ్బులు ఎగ్గొట్టడంతో నష్టాలు ఎదురయ్యాయి. అయితే నేను ఇతరులకు సరఫరా చేస్తే బిల్లుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, స్వయంగా కాంట్రాక్టర్‌గా మారితేనే పరిస్థితి మారుతుందని నిర్ణయించుకున్న. కాంట్రాక్టర్‌గా అడుగుపెట్టి.. 2002లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా ఎదిగాను. చల్లా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించి 2003 నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటివి, ఇతర ప్రాజెక్టులు చేశాను.
- కూతురు స్కూల్ అడ్మిషన్.. గ్రీన్‌వుడ్ ఆవిర్భావం
తన కుమార్తెను స్కూల్‌లో చేర్పించేందుకు వెళ్లిన సందర్భం విద్యారంగంలోకి తీసుకొచ్చింది. స్కూల్ లో సౌకర్యాలు లేకపోవడంతో అప్పటి ప్రిన్సిపాల్ కు కొత్త పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ఒక భాగస్వామి ఉంటే బాగుంటుందని చెప్పడంతో 2003లో గ్రీన్‌వుడ్ స్కూల్ ను ప్రారంభించడం జరిగింది. ఆరంభం నుంచే పాఠశాలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు 23 బ్యాచ్‌లు పదో తరగతి పూర్తి చేసుకున్నయి.
- అవమానం పెంచిన కసి.. రాజకీయాల్లోకి ఎంట్రీ
కాంట్రాక్టర్ గా 2008లో శాయంపేట–ప్రగతిసింగారం మధ్య చలివాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాను. ఆ పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో అప్పటి పొలిటికల్ లీడర్ ఒకరు తనను ఇబ్బంది పెట్టాడు. ఒకసారి వాల్ల ఇంటికి వెళ్లినప్పుడు ఎదురైన అవమానం తన జీవితాన్ని రాజకీయాల వైపు మళ్లించింది. “నన్ను అవమానించిన కుటుంబంపైనే ఎన్నికల్లో పోటీ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా”. 2009లో పరకాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డితో పాటు చంద్రబాబునాయుడికి వివరించిన. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడు తనను చులకనగా మాట్లాడినా.. పరకాల నుంచే పోటీ చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు.
- ఎమ్మెల్సీ అవకాశం వచ్చినా వద్దన్నా..
2009లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. తన లక్ష్యం ప్రత్యక్ష ఎన్నికలేనని పార్టీ అధిష్టానానికి చెప్పి తిరస్కరించిన. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–టీఆర్ఎస్ పొత్తులో సీట్ల సర్దుబాటులో భాగంగా పరకాల సీటు టీఆర్ఎస్‌కు వెళ్లింది. అప్పుడు టీఆర్ఎస్ నేతలు మా పార్టీ తరఫున పోటీ చేయాలని అడిగినా నేను ఒప్పుకోలేదు.
- బీఫాం కోసం సినిమా తరహా డ్రామా
2009 ఎన్నికల్లో పార్టీ బీఫాం అందజేయాల్సిన ఆఖరి రోజు జరిగిన పరిణామాలు ఇప్పటికీ మర్చిపోలేనివి. చివరి నిమిషంలో పార్టీ నుంచి బీఫాం వస్తుందనే సమాచారం రావడంతో డ్రైవర్‌ను పార్టీ కార్యాలయానికి పంపాను. బీఫాంలతో కారు బయలుదేరిన సమయంలో కాజీపేట ఫాతిమా బ్రిడ్జి వద్ద కొందరు పార్టీ నాయకులు కారును అడ్డుకుని బీఫాంలను తీసుకున్నారు. తనకు రావాల్సిన బీఫాం మరొకరికి వెళ్లింది. మళ్లీ ఫాంలను సరిచేసుకుని వచ్చేలోపే నామినేషన్ కేంద్రం వద్ద గేట్లు మూసివేశారు. పోలీసులు నన్ను బలవంతంగా గేటు బయటికి తీసుకెళ్లగా.. మా డ్రైవర్ గోడ దూకి లోపలికి వచ్చాడు. నిమిషాల తేడాతో బీఫాం అందజేసే అవకాశం కోల్పోయాను. ఆ ఘటన మొత్తం సినిమా క్లైమాక్స్‌ను తలపించింది.
- 2012లో తొలి ఎన్నికల పోరు
పరకాల శాసనసభ నియోజకవర్గానికి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నాకు పరకాల నుంచి టీడీపీ టికెట్ దక్కింది. పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించిన. పార్టీకి చెందిన కొందరు తనకు ప్రతికూల పరిస్థితులు కల్పించడంతో ఓడిపోయాను. ఈ విషయం చంద్రబాబునాయుడికి తెలియడంతో సంబంధిత నాయకులను ఆయన మందలించారు. ఆ సమయంలోనే పరకాల నియోజకవర్గంతో పాటు శాయంపేట మండలంలోని 263 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను అందజేసిన.
- యువగర్జనకు పరకాల కోసం స్పెషల్ ట్రైన్
నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశ సమయంలో 2008లో టీడీపీ గుంటూరులో నిర్వహించిన యువగర్జన సభకు పరకాల నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. జిల్లా నాయకుడిని తనకు ఒక బోగీ ఇవ్వాలని కోరగా.. ఇంకా తనకు పదవి లేదని, ఇవ్వలేమని చెప్పాడు. దీంతో సభ ఇన్ చార్జ్ ఎర్రం నాయుడు వద్దకు వెళ్లి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చవుతుందని తెలుసుకుని.. ఆ మొత్తాన్ని చెల్లించి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి నుంచి పరకాల నియోజకవర్గ కార్యకర్తల కోసం ప్రత్యేక రైలు వేయించుకున్న. రైలు నిండా కార్యకర్తలను తీసుకెళ్లడమే కాకుండా వారికి భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించిన. ఈ కార్యక్రమం అప్పట్లో రాజకీయంగా పెద్ద హల్‌చల్ సృష్టించింది.
- ‘ఇంటింటికీ మీ చల్లా’తో ప్రజల్లోకి..
2013 నవంబర్ 22న ‘ఇంటింటికీ మీ చల్లా’ కార్యక్రమాన్ని ప్రారంభించి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టివచ్చాను. ఒక్కో గ్రామంలో రెండు మూడు రోజుల పాటు ఉండి, ఉదయం–సాయంత్రం ప్రజలతో మమేకమయ్యాను. ఈ పర్యటన దాదాపు ఏడాది పాటు 2014 ఎలక్షన్ వరకు సాగింది. ప్రతీ ఇంటి పరిస్థితి, గ్రామాల్లోని మౌలిక సమస్యలు, రోడ్లు, కరెంటు, తాగునీరు, పేదరికం వంటి అంశాలను స్వయంగా తెలుసుకున్న. ఒక గ్రామంలో ఆకలితో పస్తులు పడుకున్న డిగ్రీ విద్యార్థినిని చూసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసింది. ఈ పాదయాత్ర ద్వారా గ్రామాల అవసరాలపై స్పష్టమైన అవగాహన వచ్చింది. తర్వాత ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులకు అదే ప్రణాళికగా మారింది.
- మొక్కజొన్న పొలంలో దాక్కున్న
రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో దాడులు ఎదుర్కొన్న. పొలిటికల్ ప్రత్యర్థులు నన్ను నియోజకవర్గం నుంచి వెళ్లగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. 2011–12 మధ్య నందిరాంనాయక్ తండాలో ప్రభ బండ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో రాళ్లతో దాడి చేశారు. కొబ్బరికాయ కొట్టేందుకు వంగిన సమయంలోనే దాడి జరగడంతో తాను, కార్యకర్తలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాం. కొందరితో కలిసి మొక్కజొన్న చేనులో దాక్కున్న. ఘటనపై సమాచారం అందడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పట్లో ఈ ఘటన నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి వచ్చి తనకు అండగా నిలిచారు. 2009లో కూడా తన వెంట వచ్చిన ఆరు కార్లను ధ్వంసం చేశారు. రాజకీయాల్లో మంచి, చెడు రెండూ ఉంటాయని ముందే నిర్ణయించుకుని వచ్చిన.
- తెలంగాణ కోసం పోరాటం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పరకాల నియోజకవర్గంలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపాను. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడాను. నియోజకవర్గంలో 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అన్ని గ్రామాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది.
- 2014లో గెలుపు.. టీఆర్ఎస్‌లోకి చేరిక
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పరకాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించా. తనపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. ఆ తర్వాత వారి అభీష్టం మేరకు టీఆర్ఎస్‌లో చేరాను.
- ‘పదేళ్లలో రూ.2,500 కోట్ల అభివృద్ధి’
ఎమ్మెల్యేగా పదేళ్ల కాలంలో పరకాల నియోజకవర్గానికి సుమారు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చిన. ‘ఇంటింటికీ మీ చల్లా’ పర్యటనలో గుర్తించిన సమస్యల్లో దాదాపు 90 శాతం పరిష్కరించా. ప్రతీ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నిధులు వచ్చే రోజుల్లోనూ ప్రత్యేకంగా పట్టుబట్టి రూ.35 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టిన.
తన హయాంలో చేపట్టిన ప్రధాన పనులు..
* 2016లో పరకాల రెవెన్యూ డివిజన్ పునరుద్ధరణ
* కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం
* రెండు కొత్త మండలాలు. కార్యాలయాల భవనాలు
* పరకాల ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆస్పత్రి
* డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు
* బాలురు, బాలికలతో పాటు ఆరు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు
* 46 గ్రామాల్లో మహిళా భవనాలు
* 57 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు
* పరకాల పట్టణంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్
* దామెర చెరువులో బోటింగ్
* పాత మార్కెట్ అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం
* కంఠాత్మకూరు బ్రిడ్జికి నిధులు
* పల్లె దవాఖానలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు
- ‘టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ఆనందాన్నిచ్చింది..
వరంగల్‌కు ఒకప్పుడు అజంజాహి మిల్ ఎంతటి గుర్తింపు తెచ్చిందో, ఆ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా పరకాల నియోజకవర్గానికి టెక్స్‌టైల్ పార్క్ తీసుకురావడం తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన విషయం. “అజంజాహి మిల్ తర్వాత వరంగల్ ప్రాంతానికి అదే స్థాయిలో ఉపాధి కల్పించే పరిశ్రమ రావాలనేది నా ఆలోచన. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ పరకాల నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉంది”.
- పుట్టిన ఊరికి ప్రత్యేక అభివృద్ధి
నేను పుట్టిన ప్రగతిసింగారం గ్రామాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. గ్రామ పంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దడంతో పాటు సొంత స్థలంలో రామాలయం నిర్మించిన. ప్రభుత్వ స్థలంతో పాటు ఎకరం భూమిని కొనుగోలు చేసి కమ్యూనిటీ హాల్, గ్రామ ప్రజల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించిన. స్కూల్, లైబ్రరీ, ఆస్పత్రి ఏర్పాటు చేశాను.
- రైతులకు అన్యాయం చేయలే
తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి రైతులకు అన్యాయం చేశారని నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. “ఏ ఒక్క రైతు భూమిని నేను అక్రమంగా తీసుకోలేదు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల జోలికే వెళ్లలేదు. నేను కొనుగోలు చేసినవి పట్టా భూములే.. అవి కూడా న్యాయబద్ధంగా అప్పటి ధర ప్రకారం కొనుగోలు చేశా”. తర్వాత కొన్ని కారణాలవల్ల వాటిని అమ్మేసిన. రాజకీయాల్లో ముళ్లకంప, పూలపాన్పు రెండూ ఉంటాయి. కష్టాలు సహజం. తాను ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లలేదు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటా.
- ‘కేసీఆర్ భోళా శంకరుడు’
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్. ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు. తనపై కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆ అనుబంధంతోనే పరకాల నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురాగలిగా. నేను ఎవరిపైనా చాడీలు చెప్పను, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటా. అందుకే కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు తనను అభిమానిస్తారు.
- ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలో ఉంటా’
వాస్తవానికి గత ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాలకు విరామం ఇవ్వాలని భావించా. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తున్న కక్షపూరిత వాతావరణం, తనను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితిని చూసి మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్న. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను గుర్తించాను. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుత. నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో నాకు బలమైన పట్టు ఉంది. పునర్విభజన జరిగినా.. నియోజకవర్గాల సరిహద్దులు మారినా.. ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుని వచ్చే ఎన్నికల్లో ఒకచోట నుంచి తప్పకుండా బరిలో ఉంటి. “ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది”.