చెల్లిని కాపాడబోయి అక్క..
- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- కాసిందేవిపేట గ్రామంలో విషాదం
చెల్లిని కాపాడబోయి అక్క..
- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- కాసిందేవిపేట గ్రామంలో విషాదం
అక్షరదర్బార్, ములుగు:
సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటారనుకున్న ఇద్దరు కుమార్తెలు కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నీటి కుంట రూపంలో వచ్చిన ప్రమాదం ఇద్దరు అక్కాచెల్లెళ్లను బలితీసుకుంది. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో ఆదివారం ఈ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది.
- ఏం జరిగిందంటే..?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసిందేవిపేట గ్రామానికి చెందిన అంజద్ పాషా తన రోజువారీ పొలం పనుల కోసం కుమార్తెలు సమిత్ (18), ఆసియా (9)లను వెంటబెట్టుకొని వెళ్లాడు. తండ్రి పొలంలో పనులు చేసుకుంటుండగా, చిన్న కుమార్తె ఆసియా నీళ్ల కోసం సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కుంటలో పడిపోయింది.
- చెల్లిని కాపాడేందుకు వెళ్లి..
కుంటలో పడి నీటిలో మునుగుతున్న చెల్లి ఆసియాను గమనించిన పెద్ద కుమార్తె సమిత్ (18) ఎలాగైనా కాపాడుకోవాలని తల్లడిల్లిపోయింది. ఆలోచించకుండా వెంటనే కుంటలోకి దిగింది. అయితే నీటి లోతు ఎక్కువగా ఉండటం, సమిత్‌కు ఈత రాకపోవడంతో చెల్లితో పాటు అక్క కూడా నీటిలోనే మునిగిపోయింది. పొలం పనిలో ఉన్న తండ్రి గమనించి వచ్చేలోపే ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
- కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
కళ్లముందే ఇద్దరు బిడ్డలు ప్రాణాలు విడవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారు ఏడుస్తున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఒకేసారి ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంతో కాసిందేవిపేట గ్రామంలో తీవ్ర సోకసంద్రం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.