స్కీంలు కాదు.. సీట్లు కావాలి
- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
స్కీంలు కాదు.. సీట్లు కావాలి!
- బీసీలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిస్తాం
- జనరల్ సీట్లు అందరివీ.. ఓసీ వర్గానికే ఎందుకు?
- జనరల్ మేయర్ స్థానం బీసీలకే దక్కాలి
- అక్టోబర్ లో పరకాలలో బీసీల బహిరంగ సభ
- ఉమ్మడి వరంగల్ లో 8 సభలకు ప్లాన్.. బీసీలను ఏకం చేస్తాం
- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
అక్షరదర్బార్,
హనుమకొండ
బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే సామాజిక న్యాయం కాదని, రాజకీయ అధికారంలో వాటా, చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ స్పష్టం చేశారు. "నోట్లు కొందరివి.. ఓట్లు బీసీలవి" అన్న రీతిలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన తన విద్యా, సామాజిక, రాజకీయ ప్రస్థానంతో పాటు వరంగల్ సమగ్ర అభివృద్ధి, బీసీల హక్కుల సాధనపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
- మేయర్ స్థానం బీసీలకే దక్కాలి
రిజర్వేషన్ స్థానాలు మినహా జనరల్ స్థానాలు అన్ని వర్గాల వారు పోటీ చేయడానికి ఉద్దేశించినవని, కానీ అవి ఒక్క వర్గానికే పరిమితమైనట్లు మారడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వరంగల్ మేయర్ స్థానం జనరల్ కాగానే నిర్దిష్ట సామాజిక వర్గాల పేర్లే ప్రచారంలోకి రావడంపై నిలదీశారు. బీసీలలో సామర్థ్యం ఉన్న నాయకులు లేరా అని ప్రశ్నించిన ఆయన, రాబోయే ఎన్నికల్లో జనరల్ మేయర్ స్థానాన్ని బీసీలకే దక్కేలా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు.
- అక్టోబర్‌లో పరకాలలో భారీ బహిరంగ సభ
బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో అక్టోబర్‌లో పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 8 ప్రధాన ప్రాంతాల్లో అవగాహన సభలు చేపడతామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు.
- ఈడబ్ల్యూఎస్, ఆదాయ పరిమితులపై వివక్ష ఏల?
బీసీలకు రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి విధిస్తూ, ఓసీలకు రూ.8 లక్షల పరిమితితో ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయడం వెనుక ఉన్న న్యాయమేమిటని నిలదీశారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ యువతకు తీవ్ర ఉద్యోగ నష్టం జరుగుతోందని, అన్ని పార్టీలు బీసీల హక్కులపై తమ స్పష్టమైన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
- అక్టోబర్ 9న జాబ్ మేళా
బీసీ యువతకు కేవలం రాజకీయ నినాదాలు సరిపోవని, విద్యా, సాంకేతిక నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా అక్టోబర్ 9న విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో బృహత్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓసీలు తమకు శత్రువులు కారని, అయితే బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన అవకాశాలను ఇతరులు ఆక్రమించకూడదని స్పష్టం చేశారు.
- వరంగల్ అభివృద్ధికి రూ.500 కోట్ల రాబడి విజన్
కుడా ద్వారా రూ.30 లక్షల లోపు ధరలోనే మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇవ్వవచ్చని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ భూముల అభివృద్ధి, మార్టిగేజ్ ఛార్జీల వసూలు ద్వారా ఒక్క పశ్చిమ నియోజకవర్గం నుంచే రూ.500 కోట్ల ఆదాయం సమకూర్చవచ్చని వివరించారు.
- ఐటీ టవర్లు, డిస్నీలాండ్ తరహా టూరిజం ప్రాజెక్ట్
వరంగల్‌ను ఐటీ హబ్‌గా మార్చే క్రమంలో అమెరికా పర్యటనలో 13 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నగరంలోనే ఐటీ టవర్లు నిర్మిస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. దేవునూరు గుట్టల్లోని 5 వేల ఎకరాల్లో డిస్నీలాండ్ తరహా పర్యాటక ప్రాజెక్టు, ఓఆర్‌ఆర్ చుట్టూ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేస్తే వరంగల్ రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు.
- తండ్రి స్ఫూర్తితోనే మాస్టర్ జీ ఇన్‌స్టిట్యూట్స్ స్థాపన
1970లో జన్మించిన తనకు తండ్రి లక్ష్మీరాజం ప్రోత్సాహమే జీవితానికి బాటలు వేసిందన్నారు. రూ.1,200 జీతంతో ఉద్యోగ జీవితం ప్రారంభించి, తండ్రి అందించిన ప్రోత్సాహంతో 1992లో మాస్టర్ జీ ఇన్‌స్టిట్యూట్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ప్రేరణతో 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని, పదవులు వచ్చినా రాకపోయినా బీసీల హక్కులు, వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి కోసం తన శ్వాస ఉన్నంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.