ఉద్యోగమంటూ ఘరానా మోసం
- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్
ఉద్యోగమంటూ ఘరానా మోసం
- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్
అక్షరదర్బార్, పర్వతగిరి: పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైబర్ నేరస్తుడిని పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన విశేషాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన మాచర్ల ఆనంద్ సాగర్ అనే వ్యక్తి, పర్వతగిరి మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన కన్నెబోయిన రాజుకు కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్ యోజన’లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. మాటలు నమ్మిన రాజు నుండి రూ.లక్ష వసూలు చేశాడు. ఎంతకాలమైనా ఉద్యోగం ఇప్పించకపోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
- విజయవాడలో అరెస్ట్ - రిమాండ్‌కు తరలింపు
బాధితుడు కన్నెబోయిన రాజు ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో విజయవాడలోని నిందితుడు పనిచేస్తున్న ఆఫీసు వద్ద అతడిని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్ తెలిపారు.