రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం
రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం
కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై చర్చ..
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
అక్షర దర్బార్, హనుమకొండ:
రబీ సీజన్ కార్యాచరణ ప్రణాళిక, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై వ్యవసాయ, అనుబంధ రంగాల జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి వి. విజయచంద్ర అధ్యక్షతన కలెక్టరేట్‌లోని జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. రబీలో అపరాలు, ఆరుతడి, ఉద్యాన, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయం పెంచేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్/మిషన్ పథకం కింద అపరాలు, జాతీయ ఆహార భద్రత–పోషకాహార మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద మక్కజొన్న, వరి, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, అవసరమైన ఇన్‌పుట్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎరువులను ఫెర్టిలైజర్ సేల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అన్ని మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఉద్యానవన, మత్స్య, ఇరిగేషన్, సహకార శాఖల అధికారులు తమ పరిధిలోని రబీ కార్యాచరణను వివరించారు. రైతులకు సమగ్ర సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వ్యవసాయాధికారి సూచించారు. అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.