సోషల్ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు
సోషల్ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు
రసాయన మందులతో పంటలకు నష్టం
మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగూర్ల
అక్షరదర్బార్,పరకాల:
పంటల్లో అధిక దిగుబడుల కోసం విషపూరిత రసాయన మందులను అధికంగా వినియోగించి రైతులు నష్టపోవద్దని మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్లో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వివిధ రకాల మందులను విచక్షణ లేకుండా వినియోగించడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అధిక దిగుబడులపై మోజుతో పంటలకు ఎక్కువ మొత్తంలో రసాయన మందులు వాడొద్దని సూచించారు. లాభాల కంటే నాణ్యమైన పంటల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
భూమి సారాన్ని కాపాడకుండా అధిక దిగుబడులు సాధించడం సాధ్యం కాదన్నారు. నేల సారాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించడంతో పాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులనే ఉపయోగించాలని సూచించారు. సదస్సులో పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన రైతులతో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.