కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ షురూ
- హనుమకొండ జన చైతన్య సభలో కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ షురూ
- 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం ఖాయం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాపాలన కాదు.. పర్సంటేజీల పాలన అని విమర్శ
- మహిళలకు రూ.1.50 లక్షలు ఇచ్చి లక్షాధికారులను చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
- వరంగల్ అభివృద్ధిని మూడేళ్లుగా అటకెక్కించారని ఆగ్రహం
- ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపు
- బీఆర్ఎస్ లో చేరిన ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి
అక్షరదర్బార్, హనుమకొండ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, 2028లో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రాబోయే ఎమ్మెల్సీ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి హనుమకొండలోని కేడీసీ గ్రౌండ్ లో బీఆర్ఎస్ జనచైతన్య సభ జరిగింది. ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తో పాటు పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు వీరిని కండువా కప్పి కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సభలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, వరంగల్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
- సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్నా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేటీఆర్ విమర్శించారు. పెన్షన్లు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రులు వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. "మొదటి ఏడాది లక్షన్నర, రెండో ఏడాది మరో లక్షన్నర, మూడో ఏడాది లక్షా 20 వేల చొప్పున మొత్తం 4.71 లక్షల పెన్షన్లకు కోత పెట్టి, కొత్తగా కేవలం 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. ఇది పెంచినట్లా లేక తగ్గించినట్లా?" అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2,000 పెన్షన్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ హామీ ఏమైందని నిలదీశారు.
మహిళలకు రూ.1.50 లక్షలు చెల్లిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. దీనివల్ల ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.85,500 బకాయి పడిందని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, ఇతర పెండింగ్ హామీలను కలిపితే చెల్లించాల్సిన మొత్తం రూ.1.50 లక్షలకు చేరుతుందని లెక్కలతో సహా వివరించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, కనీసం ఈ రూ.1.50 లక్షలు ఇచ్చి లక్షాధికారులుగా చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. విద్యార్థులకు రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం హామీని కూడా విస్మరించారన్నారు.
- సొంత ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతున్నారు
రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా 'పర్సంటేజీల పాలన' సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో సొంత పార్టీ నాయకుల వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయన్నారు. ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతుంటే, 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు జరగడం లేదని మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటున్నారని గుర్తుచేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు, దేవాలయ భూములపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు.
- ఫ్యూచర్ సిటీ కాదు.. నిజమైన ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్
కేసీఆర్ పాలనలో వరంగల్‌ను ప్రధాన పారిశ్రామిక, ఐటీ, వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేశామని కేటీఆర్ తెలిపారు. 24 అంతస్తులు, 2,250 పడకలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను 90 శాతం పూర్తి చేశామని, ఉమ్మడి జిల్లాకు 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయకుండా, సీఎం బినామీ ఆరోపణలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. మడికొండ ఐటీ పార్కుకు ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, సైయెంట్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలను, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కిటెక్స్, యంగ్వన్ వంటి పరిశ్రమలను తెచ్చామన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా, ఉన్నవి మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ భూములకు 'ఫ్యూచర్ సిటీ' అని పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని, నిజమైన భవిష్యత్తు ఉన్న నగరం వరంగల్ అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వరంగల్ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించారు.
- విద్య, సాంస్కృతిక, సాగునీటి రంగాలపై నిర్లక్ష్యం
ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబాలకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కళాకారుల కోసం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలో 'కుడా' కార్యాలయం పెట్టాలనుకోవడం దారుణమని, ప్రజల వ్యతిరేకతతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. దేవాదుల పంపులు, కన్నెపల్లి మోటార్లను నడపకుండా గోదావరి జలాలను వృథా చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి తన గడ్డంపై వ్యాఖ్యలు చేస్తూ, బూతులు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
- ఓరుగల్లుతో ఉద్యమ అనుబంధం.. ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి
17 ఏళ్ల క్రితం నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో గడిపిన రోజుల నుంచి నేటి వరకు ఓరుగల్లు గడ్డతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. 1,200 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. కాకతీయుల పౌరుషానికి ప్రతీక అయిన వరంగల్ ప్రజలు రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రగతి కోసం 2028లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు.