హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవం
మహబూబాబాద్ గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో కలకలం
- హాస్టల్ బాత్రూంలో శిశువుకు జననం.. ఆసుపత్రికి తరలింపు
- విద్యార్థిని గైర్హాజరు వల్లే గుర్తించలేకపోయామన్న ప్రిన్సిపల్
- పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శలు
- ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు
- ప్రిన్సిపల్, ఆర్సీఓలను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి డిమాండ్
అక్షరదర్బార్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని ప్రసవించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కళాశాల హాస్టల్ బాత్రూంలోనే సదరు విద్యార్థిని మగ శిశువుకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మరిపెడ మండలం చంద్రు తండాకు చెందిన ఓ విద్యార్థిని, మహబూబాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ గురుకుల కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది. మంగళవారం రాత్రి హాస్టల్ బాత్రూంకు వెళ్లిన ఆమెకు అక్కడే ప్రసవం జరిగి, మగ శిశువు జన్మించింది. ఆ శిశువు మృతి చెందింది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు, హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రసవించిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ విద్యార్థినిని కుటుంబ సభ్యులు గిరిజన సంక్షేమ మహిళ గురుకుల కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు.
ప్రిన్సిపల్ వివరణ - పోలీసుల విచారణ
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి స్పందిస్తూ.. సదరు విద్యార్థిని గత జూన్ 15న డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరిందని తెలిపారు. అయితే, ఆమె కళాశాలకు సరిగా హాజరుకాకపోవడం వల్ల గర్భవతి అనే విషయాన్ని తాము గుర్తించలేకపోయామని వివరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్థిని కుటుంబ నేపథ్యం, ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృత శిశు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మరోవైపు, గురుకుల కళాశాలలో పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు.
- ఘటనపై మాజీ మంత్రి ఆగ్రహం
మహబూబాబాద్ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 19 ఏళ్ల విద్యార్థిని ప్రసవించడం, నవజాత శిశువు మృతి చెందడంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ఆసుపత్రిని తలపిస్తోందని మండిపడ్డ ఆమె, నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన నర్సింగ్ సిబ్బంది, అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యార్థిని గర్భంతో ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయిన అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించి ప్రిన్సిపాల్, ఆర్సీఓలను తక్షణమే సస్పెండ్ చేయాలని స్టేట్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎంతో ఆశయంతో మంజూరు చేసిన ఈ కళాశాల వ్యవస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సరైన పర్యవేక్షణ లేకుండా భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బాలికల గురుకులాల్లో భద్రత, వైద్య పర్యవేక్షణపై సమీక్ష జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.