జాతీయ జెండా అవమానంపై కమిషనర్‌కు హైకోర్టు విచారణ!
జాతీయ జెండా అవమానంపై కమిషనర్‌కు హైకోర్టు విచారణ!
పరకాల మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్‌ను విచారించిన న్యాయస్థానం..
రెండు రోజుల్లో మరికొందరు అధికారుల హాజరు?
అక్షరదర్బార్, పరకాల:
పరకాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్‌ను గురువారం హైకోర్టు విచారించినట్లు సమాచారం. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 15న పరకాలలోని అమరవీరుల దామం వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు కమిషనర్ పోతరాజు పవన్ పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో కమిషనర్ జాతీయ జెండాకు వందనం చేయలేదని ఆరోపిస్తూ పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆగస్టు 25న ఈ-మెయిల్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకానికి అవమానం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం.. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971లోని సెక్షన్ 2 ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందిన ఫిర్యాదు మేరకు గురువారం కమిషనర్ హైకోర్టుకు హాజరైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయస్థానం విచారణ చేపట్టినట్లు తెలిసింది. మరోవైపు, రానున్న రెండు రోజుల్లో మరికొందరు అధికారులు సైతం కోర్టుకు హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై పరకాల పట్టణ బీజేపీ నాయకత్వం వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.