బీసీల లెక్క తేలింది.. మొత్తం జనాభాలో సగానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?
- కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందజేత
- ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ
- అదేరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమోద ముద్ర
అక్షరదర్బార్, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85 శాతం ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. దీంతోపాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. ఈమేరకు సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేశారు. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం కేబినెట్ సబ్ కమిటీకి కుల గణన నివేదికను అందజేసింది. కాగా, ఈనెల 5న కేబినెట్ ముందుకు కుల గణన నివేదిక రానుంది. మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి.. కేంద్రానికి పంపనున్నారు.