దోషులను వదిలే ప్రసక్తే లేదు
- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?
- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"
- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా
దోషులను వదిలే ప్రసక్తే లేదు
- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?
- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"
- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా
అక్షరదర్బార్, మహదేవపూర్
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని, ఈ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మొదట మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ నుంచి మేడిగడ్డ కుప్పకూలే వరకు జరిగిన పరిణామాలపై అగ్నిపరీక్ష లాంటి విమర్శలు చేశారు. 1975లో జలగం వెంగళరావు హయాంలోనే గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని రేవంత్ గుర్తు చేశారు. 2009లో వైఎస్సార్ హయాంలో రూ.38,063 కోట్లతో మొదలైన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును, కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం 'కాళేశ్వరం'గా రీడిజైన్ చేసిందని మండిపడ్డారు. అంచనాలను ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు పెంచి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. "2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అద్భుతమంటూ భ్రమలు కల్పించారు. కానీ 2023లో మేడిగడ్డ కుప్పకూలడంతో వీరి పాపం పండింది. ఎన్నికల కోసమే నిజాలను దాచాలని చూసినా, ప్రకృతి వాస్తవాలను బయటపెట్టింది" అని సీఎం అన్నారు. నవంబర్ 2023లో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
- హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనుమానాలు
మాజీ మంత్రి హరీశ్ రావు రహస్యంగా ఢిల్లీ పర్యటించడంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడానికే హరీశ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఎవరెవరిని కలిశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని, అందుకే తాము పదే పదే లేఖలు రాసినా సీబీఐ విచారణపై కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.
- ప్రాజెక్టుకు రిపేర్లు.. రైతులకు నీరు
కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు కనీసం లక్ష ఎకరాలకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. నిజానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో పంటలు పండుతున్నాయని, అది హరీశ్ రావుకు రాజకీయం తెలియకముందే ఉందన్నారు. ప్రభుత్వం త్వరలోనే నిపుణుల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయించి రైతులకు నీరందిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.