మహిళను చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన కేసులో కీలక ములుపు..
- ఐదుగురు నిందుతుల అరెస్ట్.. పరారీలో మరొకరు
- భర్త, అత్తమామ, ఆడబిడ్డలే హంతకులు
- వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్
అక్షరదర్బార్, మహబూబాబాద్: జనవరి 16న మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని భూపతి అంజయ్య ఇంట్లో మహిళ దారుణ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద మృతిగా భావించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు సవాల్‌గా తీసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ మీడియాకు వివరించారు. అరెస్టయిన వారిలో భర్త కాటి గోపి, అత్తమామ కాటి రాములు, కాటి లక్ష్మీ, హెచ్చు మహేందర్, హెచ్చు దుర్గను అరెస్ట్ చేయగా, బత్తుల వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి గడ్డపార, పార, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగింది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామానికి చెందిన కాటి రాములు-లక్ష్మి దంపతులకు పాప, బాబు ఉన్నారు. 12 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం వారు మహబూబాబాద్ కు వచ్చి సిగ్నల్ కాలనీలో రూం కిరాయి తీసుకొని ఉంటున్నారు. కొడుకు కాటి గోపి సుతారి పని కోసం ఏలూరు వెళ్ళగా అక్కడ నాగమణి పరిచయం అయింది. ఆమెకు ఇదివరకే పెండ్లి అయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటికే ఆమె భర్త చనిపోయి ఉండగా ఆమెను మచ్చిక చేసుకొని, పెండ్లి చేసుకొని నాగమణితోపాటు ఆమె ఇద్దరు పిల్లల్ని మహబూబాబాద్‌కు తీసుకొని వచ్చాడు. కాటి గోపి నాగమణిని పెండ్లి చేసుకోవడం కాటి రాములు అతని భార్య లక్ష్మి అల్లుడు కూతురు అయిన హెచ్చు మహేందర్, దుర్గకు ఇష్టం లేదు. దీంతో గోపి గుండ్ల కుంట కాలనీ లో ఒక రూం కిరాయికి తీసుకొని కూలీ పనులు చేసుకునేవాడు. కొద్దిరోజులకు గోపి తన భార్యను తల్లిదండ్రుల వద్దకు వెళ్దాం అంటే అందుకు ఆమె నిరాకరించడంతో అప్పటి నుండి గోపి తాగి వచ్చి నాగమణిని ఆమె ఇద్దరు కొడుకుల్ని కొట్టేవాడు. ఈ క్రమంలో నాగమణి ఇద్దరు కొడుకులు సంవత్సరంన్నర క్రితం ఇంట్లో నుండి పారిపోయి, ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరిలో వాళ్ళ అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. అయినా కూడా నాగమణి గోపి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడానికి నిరాకరించడంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
బొందతీసి పాతిపెట్టి..
ఈ క్రమంలో జనవరి 7న గోపి తన భార్య నాగమణితో ఘర్షణ పడి విచక్షణారహితంగా దాడిచేశాడు. తల్లిదండ్రులు, చెల్లె, బావ కిరాయికి ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళి, అదే రోజు ఆమె తలను ఇంట్లో బండల మీద గుద్ది చంపేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అదే రోజు రాత్రి నాగమణి మృతదేహంను కిరాయికి ఉంటున్న ఇంటి ముందు కాటి గోపి అతని తల్లిదండ్రులైన కాటి రాములు, కాటి లక్ష్మి అతని చెల్లె బావ హెచ్చు మహేందర్, దుర్గ , మేనమామ బత్తుల వెంకటేశ్వర్లు సహాయంతో బొంద తీసి దాంట్లో పాతిపెట్టారు. ఎక్కడికైనా తరలించాలని వారం రోజులకు నాగమణి మృతదేహాన్ని బయటకు తీయగా వాసన వస్తుండడంతో అదే బొందలో పాతిపెట్టి బయటకు వాసన రాకుండా దానిపై రోజు అలుకు చల్లేవారు. ఈ క్రమంలో కాలనీవాసులకు వాళ్ళ ఇంట్లో అందరూ ఉండి, నాగమణి కనిపించకపోవడంతో ఆమె ఆచూకి అడగడంతో కుటుంబసభ్యులంతా సంక్రాంతి పండుగ రోజు ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు,కాగా కేసును చేధిచడంలో కీలకపాత్ర పోషించిన మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్ఐ శివ, కానిస్టేబుళ్లు రుద్రయ్య, సుధీర్‌ను ఎస్పీ అభినందించారు.