పరువు నష్టం దావా వేస్తా..
- కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి
- కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా..
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
అక్షరదర్బార్, హనుమకొండ: కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం అవుతోందని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫొటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానన్నారు. దీని వెనకాల ఉన్నవాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకులు, వారు సంపాదించిన అక్రమ సంపాదనలో కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కోడిగుడ్డు పై ఈకలు పీకే చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని, వారేమైన బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్లారా అని ప్రశ్నించారు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని. ఇలాంటి విషయాలపై సమగ్ర విచారణ జరిగిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. ముఖ్యంగా ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువునష్టం దావాలు వేస్తున్నానని నాయిని స్పష్టం చేశారు.